New Year Cyber Crime : మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను బురిడీ కొట్టించడానికి రకరకాల ప్రయత్నాలతో ముందుకొస్తన్నారు. కొత్త తరహా మోసాలతో బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టే ముప్పు ఈ న్యూఇయర్ వేడుకలలో ఎక్కువగా ఉందని రాచకొండ కమిషనరేట్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. మీ పేరుతో మీ స్నేహితులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, విషెస్ కార్డులు పంపవచ్చని లింక్స్ పంపిస్తున్నారు. కావాలంటే, కార్డును పొందేందుకు ఇక్కడ ఉన్న లింక్‌పై క్లిక్ చేయండని సందేశంలో సూచిస్తున్నారు.
పూర్తిగా నేరగాళ్ల చేతిలోకి : సైబర్ నేరగాళ్లు పంపించే ఫేక్ లింక్స్‌ను పట్టించుకోవద్దని పోలీసులు జాగ్రత్తలు చెబుతున్నారు. ఒకవేళ దీని లింక్‌ను క్లిక్ చేస్తే సైబర్ నేరగాళ్లు మొబైల్‌ను హ్యాక్ చేసే ప్రమాదం ఉందంటున్నారు. లింక్ క్లిక్ చేస్తే మొబైల్లో ఉన్న డేటా, గ్యాలరీ, పర్సనల్ మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు పూర్తిగా నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయని తెలిపారు. ఖాతాలోని సొమ్ముతో పాటు విలువైన సమాచారాన్ని సైతం తస్కరించే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలియని వారి నుంచి వచ్చే మెసేజ్‌లు లింకులను క్లిక్ చేయవద్దని కోరుతున్నారు. కొత్త సంవత్సర సందేశాల విషయంలో ఇటువంటి సైబర్ లింక్‌లపై క్లిక్ చేయవద్దని జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే సైబర్ నేరగాళ్లు పెద్దఎత్తున సందేశాలను పంపుతున్నారని, మరికొద్ది గంటల్లో ఈ దాడులను తీవ్రతరం చేసే అవకాశం ఉందని సైబర్ క్రైం పోలీసులు అంచనా వేస్తున్నారు.