ForexTrading Cyber Fraud In Hyderabad:సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యుడి దగ్గర నుంచి ఫారెక్స్ ట్రేడింగ్ పేరిట ఏకంగా రూ.11.11 కోట్లు కొల్లగొట్టారు. ఓ వితంతువు, ఆమె ఇద్దరు కుమార్తెలను డిజిటల్ అరెస్టు పేరిట బెదిరించి రూ.5.66 కోట్లు దోచుకున్నారు.
ట్రేడింగ్ పేరిట మోసాలు:హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీకి చెందిన ఓ వైద్యుడి(50) నుంచి సైబర్ నేరగాళ్లు ఫారెక్స్ ట్రేడింగ్ పేరిట ఆగస్టు నుంచి నవంబర్ వరకు 34 విడతలుగా రూ.11.11 కోట్లు కాజేశారు. ఆగస్టులో మిత్తల్ అనే వ్యక్తి వైద్యుడికి వాట్సప్‌నకు లింక్ పంపించాడు. దీంతో నమ్మిన ఆయన ఆ వెబ్‌సైట్‌లో తన పేరు నమోదు చేసుకున్నారు. ట్రేడింగ్ కోసం భారతీయ కరెన్సీని యూఎస్‌డీటీ అనే క్రిప్టో కరెన్సీలోకి మార్చాలని చెప్పారు. మిత్తల్‌తో పాటు అతడి కుమార్తెగా చెప్తున్న యువతి సూచించిన ఖాతాలకు బాధితుడు డబ్బులను పంపించాడు.
లాభాలు కనిపించడంతో : ట్రేడింగ్ ఖాతాలో పెట్టుబడితో పాటు లాభాలు కనిపించడంతో వాటిని తీసుకోవడానికి వైద్యుడు ప్రయత్నించగా రూ.3.7 కోట్ల పన్ను చెల్లించాలని చెప్పారు. తన వద్ద రూ.2 కోట్లే ఉన్నాయని చెప్పడంతో మిగతా రూ.1.7 కోట్లు రుణం ఇస్తామని మిత్తల్ చెప్పాడు. రూ.2 కోట్లను బాధితుడు చెల్లించిన తర్వాత నగదు ఉపసంహరణకు ఆయన ప్రయత్నించారు.
యూఎస్ ఫెడరల్ గవర్నమెంట్ చట్టాల ప్రకారం ముందస్తు ట్యాక్స్ చెల్లించాల్సి ఉందని మళ్లీ మెలిక పెట్టారు. దీంతో మోసపోయానని తెలుసుకొని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ)కి బదిలీ చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు.
డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి: హైదరాబాద్ బషీర్‌బాగ్‌కు చెందిన 69 ఏళ్ల మహిళకు నవంబరు 13న రాత్రి 9.20 గంటల ప్రాంతంలో 87088464044 నంబరు నుంచి ఫోన్ వచ్చింది. తాను ట్రాయ్ నుంచి మాట్లాడుతున్నానని, తన పేరు రాహుల్‌కుమార్ అంటూ ఓ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. మీ ఆధార్‌కార్డు జతచేసి ఉన్న ఫోన్ నంబర్‌కు మనీ ల్యాండరింగ్, మాదకద్రవ్యాల వ్యాపారాలు, మనుషుల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులతో ప్రమేయం ఉందని బెదిరించాడు. అనంతరం సీబీఐ అధికారులమంటూ ఇద్దరు స్కైప్ ద్వారా వీడియోకాల్ చేశారు. ఆమెను డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు చెప్పి ఆమెతో పాటు ఇద్దరు కుమార్తెలనూ 24 గంటలూ వీడియో కాల్ పర్యవేక్షణలో ఉంచారు.
సీబీఐ, ఆర్బీఐ ముద్రలతో ఉన్న పత్రాలు : వారిని బెదిరించేందుకు సీబీఐ, ఆర్బీఐ ముద్రలతో ఉన్న పత్రాలు పంపించారు. ఇదంతా 20 రోజుల పాటు కొనసాగింది. మనీ ల్యాండరింగ్ కేసు వల్ల బ్యాంకు ఖాతాల వివరాలు పంపించాలని కోరారు. బాధితురాలు తనతో పాటు తన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలు పంపారు. ఆ ఖాతాల్లో ఉన్న డబ్బంతా తాము చెప్పిన ఖాతాల్లోకి బదిలీ చేయాలన్నారు. విచారణ పూర్తయ్యాక పంపుతామని చెప్పారు. బాధితురాలి కుమార్తెల ఖాతాల్లోని డబ్బును కొంత ఆర్టీజీఎస్ ద్వారా, మరికొంత బ్యాంకుల్లో నుంచి నిందితుల ఖాతాల్లోకి పంపించుకున్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా తీపించారు. నవంబరు నుంచి వివిధ దఫాల్లో రూ.5,66,51,100 బదిలీ చేయించుకున్నారు.
డిసెంబరు 8న అజయ్ గుప్తాకు ఫోన్ చేస్తే సంబంధిత పత్రాలన్నీ తీసుకొని సమీపంలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లాలని తెలిపారు. అక్కడుండే అధికారులు వాటిని పరిశీలించి ఖాతాల్లోకి డబ్బు పంపిస్తున్నారని చెప్పారు. వెంటనే బాధితులు కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లి ఆరా తీస్తే ఇదంతా మోసమని తేలింది. దీంతో బాధితురాలు సోమవారం టీజీసీఎస్‌బీకి ఫిర్యాదు చేశారు.
'బాబాయ్.. నా పాస్‌పోర్ట్ లాక్కున్నారు' : ఫేస్బుక్లో మెసేజ్ పెట్టి లక్ష కొట్టేసిన కేటుగాళ్లు
ఇలాంటి నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయా? - అయితే అస్సలు లిఫ్ట్ చేయకండి