Cyber Criminals Cheating on Social Media Links :తెలుగు రాష్ట్రాల్లో సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకూ పెరుగుతున్న ఆర్ధికభారాన్ని అధిగమించేందుకు అదనపు ఆదాయం కోసం వెతుకుతున్నారు. రెండు చేతులా సంపాదించాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాల్లో వచ్చే లింక్‌లకు స్పందిస్తూ, మాయగాళ్ల వలలో చిక్కుతున్నారు.
ఎలా ఇరికిస్తారంటే :పాన్ (PAN), డీమ్యాట్ ఖాతా అవసరం లేకుండానే యాప్‌లో పెట్టుబడి అంటారు. లాభాలకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదనే ప్రకటనలతో బాధితులను నమ్మిస్తారు. నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్లు, వాట్సాప్ గ్రూప్‌ల్లో బాధితులు తెలియక చేరుతున్నారు. ఆయా గ్రూప్‌లో అంతర్జాతీయ మార్కెట్, క్రిప్టో కరెన్సీలో (Crypto currency) పెట్టుబడులకు 100% లాభం వచ్చిందంటూ ఒక సభ్యుడు బ్యాంకు ఖాతాలో నగదు జమైనట్టు స్క్రీన్‌షాట్ పోస్ట్ చేస్తాడు. మరో సభ్యుడు తనకు వచ్చిన ఆదాయంతో రూ.50 లక్షల కారు కొన్నట్లు ఫొటో ఉంచుతాడు. మోసగాళ్లే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు తెలియని బాధితులు నమ్మేస్తున్నారు. ఇదే సరైన వేదిక అని నమ్మి ఏ మాత్రం ఆలోచించకుండా సొంతూళ్లలో ఉన్న స్థలాలు, భూములు విక్రయించి వచ్చిన సొమ్మును పెట్టుబడి పెడుతున్నారు. ఈ ఏడాది 10 నెలల వ్యవధిలో సుమారు 1000 మంది ఇన్వెస్ట్‌మెంట్ మోసాల్లో రూ.60 కోట్ల మేర నష్టపోయినట్లు సైబర్ అధికారుల అంచనా.
వీడియో కాల్ వస్తే అలా చేయండి - ఫ్రంట్ కెమెరా మూసిన తర్వాతే లిఫ్ట్ చేయండి
హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్‌కు చెందిన వ్యాపారి (57) సామాజిక మాధ్యమాల్లో కనిపించిన ఎం.స్టాక్ ట్రేడింగ్ కంపెనీ ప్రకటనకు ఆకర్షితుడై రూ.23 లక్షలు పెట్టుబడి పెట్టాడు. పెట్టిన పెట్టుబడి ఉపసంహరించుకునే మార్గం లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. బంజారాహిల్స్‌కు చెందిన మరో వ్యాపారి (35) వాట్సాప్ నంబర్‌కు వచ్చిన లింక్ ద్వారా జీ02 బాక్‌క్లేస్ స్టాక్ పుల్‌లో ప్రీమియం సభ్యుడిగా చేరాడు. ఆ యాప్‌లో రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయాడు. బేగంపేటకు చెందిన ఉద్యోగి (49) గూగుల్ యాడ్ ద్వారా జఫ్పరీస్ వెల్త్ మల్టిఫ్లికేషన్ గ్రూప్‌ను (Jefferies Wealth Multiplication Group) సంప్రదించాడు. అందులో రూ.21 లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు.
సైబర్ నేరాల ఉచ్చులో యువత, మహిళలే ఎక్కువ - అత్యధికంగా విశాఖలో నమోదు - CYBER CRIMES IN AP
వెబ్‌సైట్లు, యాప్‌ల్లో కనిపించే స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రకటనలు నమ్మి ఎక్కువ మంది మోసపోతున్నారు. ఏ రంగంలోనూ రోజులు, నెలల వ్యవధిలో 100, 200 % లాభాలు రావు. మేసేజ్, మెయిల్స్, వాట్సాప్ గ్రూపులకు వచ్చే అనుమానాస్పద లింక్‌లు, సమాచారాన్ని నమ్మొద్దు. మోసపోతే వీలైనంత తక్కువ సమయంలో 1930 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే, సొమ్ము వెనక్కి రప్పించే అవకాశం ఉంటుంది - కవిత దార, సైబర్‌క్రైమ్ డీసీపీ
"నేను కూడా సైబర్ నేరగాళ్లకు టార్గెట్టే" - ఆ నంబర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి : విశాఖ సీపీ