Cyber Crime in Satya Sai District ₹33 Lakh Fraud :కష్టపడి చెమటోడ్చి డబ్బు కూడగట్టేవారు కొందరు. కాలుమీద కాలేసుకుని వడ్డీలు చక్ర వడ్డీల పేరులో ఆస్తులు సంపాదింస్తారు మరి కొందరు. రోజంతా ఆఫీసులో పని చేసి, ఇలా ఎన్నో విధాలుగా లక్ష్మీ కటాక్ష కోసం పరితపిస్తుంటారు జనాలు. కానీ ఈ రోజుల్లో పక్కనోళ్ల సొమ్ము ఎలా కొట్టేద్దామా అని చూస్తున్నవారే ఎక్కువ, అందులోనూ ఇళ్ల మీద పడి దోచుకోవడం ఓల్డ్ స్టైల్ అయిపోయింది. దర్జాగా సిస్టమ్ ముందు కూర్చుని లూటీ చేస్తూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు సైబరాసులు. ఇలాంటి ఘటనే తాజాగా సత్యసాయి జిల్లాలో జరిగింది.
సైబర్ నేరాల ఉచ్చులో యువత, మహిళలే ఎక్కువ - అత్యధికంగా విశాఖలో నమోదు - CYBER CRIMES IN AP
ముంబయి పోలీసులం అంటూ సైబర్ నేరగాళ్లు 70ఏళ్ల ఓ వైద్యుడికి వీడియో కాల్ చేసి బెదిరించి రూ.33 లక్షలను తమ ఖాతాలో వేయించుకున్నారు. ఆధ్యంతం డ్రామాను తలపిస్తున్న ఈ ఘటనలో వైద్యుడి భయమే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారింది. బెదిరింపులకు భయపడి కంగారులో 33 లక్షలు మోసగాళ్ల ఖాతాలో వేశాడు. తరువాత నిజానిజాలు తెలుసుకున్నాక, తాను మోసపోయానని గ్రహించాడు. దీంతో బాధితుడు ధర్మవరం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి తన గోడును వెల్లబోసుకున్నాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ధర్మవరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న వెల్లడించారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన వైద్యుడు సూర్యనారాయణరెడ్డికి ఇటీవల ముంబయి పోలీసు యూనిఫామ్ ధరించిన ఓ వ్యక్తి వాట్సప్ వీడియో కాల్ చేశాడు. ముంబయిలో నరేష్ గోయల్ అనే వ్యక్తి కెనరా బ్యాంకులో రూ.500 కోట్లు అప్పుగా తీసుకున్నారని, అందులో కొంత మొత్తం మీ ఖాతాలో జమచేశారు. అందుకు ఆ వ్యక్తి నుంచి మీరు రూ.20 లక్షలు కమీషన్ తీసుకున్నారని వైద్యుడిని బెదిరించారు. రూ.33 లక్షలు ఇవ్వాలని లేకపోతే అక్కడికి వచ్చి అరెస్టు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయభ్రాంతుడైన వైద్యుడు నిమిషాల వ్యవధిలో రూ.20 లక్షలు, రూ.13 లక్షల చొప్పున రెండు విడతలుగా సైబర్ నేరగాళ్లు ఇచ్చిన ఖాతాలో జమ చేశాడు. అనంతరం నరేష్ గోయల్ అనే వ్యక్తి నుంచి తన ఖాతాలో అసలు నగదు జమ అయ్యిందా అనే విషయంపై ఆరా తీశాడు. మోసపోయానని తెలుసుకున్న వైద్యుడు ధర్మవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తుతో వైద్యుడిని మోసగించిన వ్యక్తులను పోలీసులు గుర్తించారు. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన ఇళయజర్, నంద్యాల జిల్లా అయ్యలూరు మెట్టు గ్రామానికి చెందిన ప్రహ్లాద, నంద్యాలకు చెందిన అంబిరెడ్డి, ఆళ్లగడ్డకు చెందిన సత్యం, బాపట్ల జిల్లా గూడవల్లికి చెందిన జావిద్‌ను అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. వైద్యుడి నుంచి సైబర్ నేరగాళ్ల ఖాతాలో జమ చేసిన డబ్బును త్వరలో రికవరీ చేస్తామని ఎస్పీ చెప్పారు.
డాక్టర్ 'డిజిటల్ అరెస్ట్'!- రూ.2.8 కోట్లు స్వాహా- 'సైబర్' నేరగాళ్ల పనే! - Doctor Cheated By Cyber Frausters