Cyber Crime in Hyderabad : మసిపూసి మారేడు కాయ చేయడమంటే ఇదేనేమో. ముందుగా బడా వ్యాపారవేత్తను టార్గెట్గా పెట్టుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులమంటూ ఫోన్ చేశారు. మీ పేరిట ఇంటర్నేషనల్ కొరియర్ ఏజెన్సీ ద్వారా పార్శిల్ వచ్చిందని నమ్మించారు. అందులో మత్తు పదార్థాలు ఉన్నాయని బెదిరించారు. దీనిపై కేసు నమోదు చేస్తామని, అరెస్టు కాకుండా ఉండాలంటే డబ్బులు పంపించాలని డిమాండ్ చేసి నగదు(Cyber Crime) దోచేసుకున్నారు. హైదరాబాద్లో చోటుచేసుకున్న ఈ ఘటనలో పోలీసుల చాకచక్యంతో పెద్ద మొత్తంలో సొమ్మును రికవరీ చేయగలిగారు.
గవర్నర్ తమిళిసై ఎక్స్ అకౌంట్ హ్యాక్- సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారికి వారం రోజుల క్రితం అజ్ఞాత వ్యక్తుల నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాము కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులమంటూ సదరు వ్యాపారితో మాట్లాడారు. ప్రముఖ ఇంటర్నేషనల్ కొరియర్ సంస్థ ద్వారా మీ పేరుపై ఒక పార్శిల్ వచ్చిందని, అందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయని నమ్మించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని కేసు పెడితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బెదిరించారు.
Cyber Crimes in Telangana :ఇదంతా నిజమనుకుని భయపడిపోయిన ఆ వ్యాపారి తనను రక్షించమని అవతలి వ్యక్తిని వేడుకున్నారు. దీంతో వారు చెప్పిన ఖాతాలో రూ.కోటి జమ చేస్తే కేసు కాకుండా చూస్తామని వారు నమ్మించారు. అసలే భయంతో ఉన్న ఆయన, వెంటనే రూ.98 లక్షలు జమ చేశాడు. ఆ తరువాత అనుమానం వచ్చి వెంటనే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తెలంగాణ సైబర్ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరోకు వివరాలు చేరాయి.