Cyber Crime Cases Increasing Tremendously in Telangana :ప్రస్తుతం సైబర్ నేరాలు అతి పెద్ద సమస్యగా మారాయి. సాధారణ నేరాల కంటే అత్యధికంగా నమోదవడమే కాకుండా కోట్ల రూపాయలు సొత్తు నేరగాళ్లు కాజేస్తున్నారు. గత మూడేళ్ల గణాంకాలు పరిశీలిస్తే రాజధానిలో సగటున 9 నుంచి 10 వేల మధ్య ఇళ్లల్లో దొంగతనాలు, వాహన, సెల్ఫోన్ చోరీలు రికార్డు కాగా, సైబర్ నేరాల సగటు పెరుగుదల 10-15 శాతం కంటే ఎక్కువగా ఉంటోంది. బాధితులు పోగొట్టుకునే సొత్తు రూ. వందల కోట్లలో ఉంటోంది. ఒక్క 2023లో నగరంలోని మూడు కమిషనరేట్లలో కలిపి సుమారు రూ.450 కోట్లు పోగొట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
దొంగతనాలు, ఇతర చోరీల పోగొట్టుకునే సొత్తు కంటే ఇది కనీసం 10 రెట్లు ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే దొంగతనాలు, చైన్ స్నాచింగ్ తదితర కేసుల్లో కాజేసిన సొత్తు రికవరీ చేసేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి. నిందితుల ప్రమేయం నేరుగా ఉండడం, సీసీ పుటేజీలు, వేలిముద్రలు(Finger Prints), ఇతర సాంకేతిక ఆధారాలతో తేలిగ్గా చిక్కుతారు. ఇటీవలికాలంలో ఇళ్లల్లో దొంగతనాలు, సొత్తు కోసం హత్య వంటివి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇదే సమయంలో సెల్ఫోన్ చోరీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) వెబ్సైట్ అందుబాటులోకి రావడంతో చోరీ (పోగొట్టుకున్న) సెల్‌ఫోన్ల రికవరీ పెరుగుతోంది.
సైబర్ నేరాల్లో డబ్బులు కోల్పోతున్న బాధితులు - కొత్త విధానంతో సొమ్మును రికవరీ చేస్తున్న పోలీసులు
Cyber Crime Cases in Telangana :అదే సైబర్ నేరాల్లో రికవరీ రేటు మాత్రం సరాసరి 5 శాతం కూడా ఉండడం లేదు. నిందితుల్ని కటకటాలు లెక్కించడమూ కష్టసాధ్యంగా మారుతోంది. ఉదాహరణకు హైదరాబాద్ కమిషనరేట్లో గతేడాది చోరీ కేసుల్లో మొత్తం రూ.38.38 కోట్లు సొత్తు కాజేయగా పోలీసులు రూ.28.45 కోట్లు (74.15%) రికవరీ చేశారు. అదే సైబర్ నేరాల్లో సగటున 5- 6 శాతం మాత్రమే ఉంటోంది. సైబర్ క్రైమ్ పోలీసులు అంచనా ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు సైబర్ నేరాల బారినపడి రోజూ సగటున రూ.3 కోట్లకు పైనే పోగొట్టుకుంటున్నారు. వాస్తవానికి సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టే సొమ్ము ఇంతకు 10 రెట్ల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా.