Vehicle Rush at Vijayawada Highway : రెండు తెలుగు రాష్ట్రాల్లో గత నెలరోజులుగా నెలకొన్న ఎన్నికల సందడి ముగిసింది. ఓట్ల కోసం స్వగ్రామాలకు వెళ్లిన ఓటర్లు తిరిగి రాజధాని బాట పట్టారు. తిరుగు ప్రయాణమైన ఓటర్ల వాహనాలతో జాతీయ రహదారి రద్దీగా మారింది. వందలాది వాహనాలు బారులు తీరి వెళుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ వద్ద వాహనాలతో ట్రాఫిక్ జామ్ అయింది. అర కిలోమీటర్ వరకు వాహనాలు స్తంభించిపోయాయి. వాహనాలు నెమ్మదిగా వెళుతున్నాయి. టోల్‌గేట్ దాటడానికి 15 నిమిషాలు పడుతోంది. 16 గేట్లగాను 10 గేట్ల ద్వారా హైదరాబాద్ వైపు వాహనాలను పంపిస్తున్నారు.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల సందడి ముగిసింది. చెదురుమొదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదయ్యింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత అకాల మరణంతో కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. ఈపోలింగ్‌లో సాయంత్రం 5 గంటల వరకు 47.88 శాతం పోలింగ్ నమోదయ్యింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు రణరంగంగా మారాయి. పలు చోట్ల తీవ్రస్థాయిలో ఉద్రిక్త సంఘటనలు చోటుచేసుకున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో 67.99 శాతం పోలింగ్ నమోదయ్యింది.