ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్రికెటర్లు కూడా రాష్ట్రం నుంచి పారిపోవాల్సిందేనా? - వైసీపీ దెబ్బకు హనుమ విహారి ఔట్ - political interference in ACA

Cricketer Hanuma Vihari ACA Issue: వైసీపీ నాయకుల దెబ్బకు పారిశ్రామికవేత్తలేం ఖర్మ, క్రికెటర్లు కూడా రాష్ట్రం నుంచి పారిపోవాల్సి వస్తోంది. దేశం తరపున పలు టెస్టు మ్యాచ్‌లు ఆడిన అంతర్జాతీయ క్రికెటర్ హనుమ విహారి వైసీపీ నాయకుల దెబ్బకు జీవితంలో ఇంకెప్పుడూ ఆంధ్రప్రదేశ్ తరపున రంజీ మ్యాచ్‌లు ఆడనంటూ తీవ్ర ఆవేదనతో దండం పెట్టి వెళ్లిపోయారు. అంతర్జాతీయ క్రికెటర్‌కు ఆ దుస్థితి కల్పించింది. ఏ ముఖ్యమంత్రో, మంత్రో, వైసీపీ అగ్రనేతలో అనుకుంటున్నారా? వారి అండదండలు పుష్కలంగా ఉన్న తిరుపతిలోని ఓ సాధారణ కార్పొరేటర్. ఆ నాయకుడి దెబ్బకు హనుమ విహారి వంటి క్రికెటర్ ఆంధ్రా రంజీ జట్టు కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు, ఇప్పుడు తీవ్ర అవమానభారంతో ఏకంగా జట్టునే వదిలి వెళ్లిపోయారు.

hanuma_vihari_issue
hanuma_vihari_issue

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2024, 8:10 AM IST

క్రికెటర్లు కూడా రాష్ట్రం నుంచి పారిపోవాల్సిందేనా? - వైసీపీ దెబ్బకు హనుమ విహారి ఔట్

Cricketer Hanuma Vihari ACA Issue: అయిదేళ్ల పాలనలో రాష్ట్రం కొన్ని దశాబ్దాలపాటు కోలుకోలేనంతగా విధ్వంసాన్ని మిగిల్చిన వైసీపీ నాయకులు చివరకు 'జంటిల్మెన్ గేమ్'గా ప్రసిద్ధికెక్కిన క్రికెట్‌ను వదల్లేదు. మొన్నటికి మొన్న ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడికి వైసీపీ నేతల చేతిలో చేదు అనుభవం ఎదురైంది. ఆ దెబ్బకు రాయుడు మళ్లీ కోలుకోలేదు. ఇప్పుడు హనుమ విహారి వంతు! ఆంధ్రా రంజీ జట్టులో 17వ సభ్యుడిగా ఉన్న ఓ వైసీపీ కార్పొరేటర్ కుమారుణ్ని కెప్టెన్‌గా విహారి మందలించడమే తప్పైంది.

విహారి ఏడేళ్లుగా ఆంధ్రా రంజీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్‌లో బెంగాల్‌తో ఆంధ్రా జట్టు ఫస్ట్ మ్యాచ్ ఆడింది. ఆ సందర్భంగా 17వ ఆటగాడిగా ఉన్న పృథ్వీరాజ్‌ను ఏ కారణం చేతనో కెప్టెన్ విహారి మందలించారు. అంతే పృథ్వీరాజ్‌ తండ్రి నర్సింహాచారికి చిర్రెత్తుకొచ్చింది. ఆంధ్రా క్రికెట్ ఆసోసియేషన్ మొత్తం వైసీపీ నేతల గుప్పిట్లోనే ఉండటంతో వారికి ఫిర్యాదు చేశారు. వారు ఆఘమేఘాల మీద స్పందించారు.

మావాడి పుత్రరత్నాన్నే తిడతావా? అంటూ మొదటి మ్యాచ్ తర్వాత విహారిని కెప్టెన్సీ నుంచి తప్పించి రికీభుయ్‌కు సారథ్యం అప్పగించారు. ఇన్నాళ్లూ అవమాన భారాన్ని పంటిబిగువున భరిస్తూ మ్యాచ్‌లు ఆడిన విహారి మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టు ఓడిపోయాక తన మనసులోని ఆవేదనను ఇన్స్‌స్టా వేదికగా బయట పెట్టారు. రాజకీయ జోక్యం వల్లే కెప్టెన్సీ కోల్పోయానని, అవమానానికి గురయ్యానని ఆయన పెట్టిన పోస్టు జాతీయ స్థాయిలో కలకలం సృష్టించింది.

ఆంధ్రా క్రికెట్ జట్టుకు హనుమ విహారి గుడ్ బై - ఆ రాజకీయ నేత కుమారుడే కారణం!

తప్పేమీ లేకున్నా కెప్టెన్సీ నుంచి తీసేశారు:బెంగాల్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌కు తానే కెప్టెన్‌ అని ఆ మ్యాచ్ సందర్భంగా 17వ ఆటగాడిపై కోప్పడ్డానని విహారి తన పోస్టులో వెల్లడించారు. అతను ఆ విషయాన్ని తండ్రికి చెప్పాడని, రాజకీయ నాయకుడైన ఆయన తనపై చర్య తీసుకోవాలని ఏసీఏని కోరారని పేర్కొన్నారు. ఆ మ్యాచ్‌లో బెంగాల్ 410 పరుగుల లక్ష్యాన్ని నిలిపినా పోరాడి గెలిచామని గత సీజన్‌ ఫైనల్‌కు చేరిన జట్టును మొదటి మ్యాచ్‌లోనే ఓడించినా కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సిందిగా ఏసీఏ ఆదేశించిందని, తన తప్పేమీ లేకున్నా కెప్టెన్సీ నుంచి తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫస్ట్ మ్యాచ్ తర్వాత కెప్టెన్సీ నుంచి ఏసీఏ బలవంతంగా తొలగించినా వ్యక్తిగత కారణాలతోనే కెప్టెన్సీ నుంచి వైదొలగినట్టు అప్పట్లో పేర్కొన్న విహారి, ఈ సీజన్లో ఆంధ్రా క్రికెట్ జట్టు కథ ముగియడంతో ఇప్పుడు అసలు విషయాన్ని వెల్లడించారు. కెప్టెన్సీ నుంచి తీసేయడాన్ని చాలా ఇబ్బందికరంగా అవమానకరంగా భావించానని, ఆటపైనా, జట్టుపైనా గౌరవంతో ఇన్నాళ్లూ కొనసాగానని తెలిపారు. ఆత్మగౌరవానికి భంగం వాటిల్లాక, ఇక ఆంధ్రా జట్టు తరపున ఆడకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు.

ఈ సీజన్లో విహారి 13 ఇన్నింగ్స్ ల్లో 522 పరుగులు చేశారు. జట్టులో రికీభుయ్ తర్వాత రెండో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారుడు ఆయనే. ఆంధ్రా తరపున అంతర్జాతీయ క్రికెట్ అడిన అతికొద్ది మంది క్రీడాకారుల్లో విహారి ఒకరు. భారత్ తరపున ఆయన 16 టెస్ట్ మ్యాచ్లు ఆడి, 839 పరుగులు చేశారు. వెస్టిండీస్‌పై సెంచరీ కొట్టారు.

No facilities in the grounds: 'ఆటల్లేవ్.. ఆడుకోవడాల్లేవ్.. అయినా ఐపీఎల్ కల'

ఏసీఏ పెద్దలకు లేఖ:హనుమ విహారిని కెప్టెన్‌గా తొలగించిన తర్వాత పృథ్వీరాజ్ మినహా జట్టులోని మిగతా 15 మంది సభ్యులూ ఏసీఏ పెద్దలకు ఒక లెటర్ రాశారు. విహారి తప్పేమీ లేదని, కెప్టెన్‌గా ఆయననే కొనసాగించాలని కోరారు. వారిలో విహారి తర్వాత కెప్టెన్‌గా నియమితుడైన రికీభుయ్ కూడా ఉన్నారు. విహారి అభ్యంతరకర పదజాలంతో దూషించినట్టు, దురుసుగా పైకి దూసుకొచ్చినట్టు తమ సహచర సభ్యుడొకరు ఫిర్యాదు చేశారని, అది నిజం కాదని వారంతా లేఖలో స్పష్టం చేశారు.

ఆ రోజు ఏం జరిగిందనడానికి మా 15 మంది ఆటగాళ్లతోపాటు, సహాయ సిబ్బంది కూడా సాక్షులుగా ఉన్నారని, విహారితో మాకెలాంటి సమస్యలూ లేవని తెలిపారు. ఆయన ఎప్పుడూ ఉత్తమమైన ఆటను రాబట్టేందుకు కృషి చేస్తారని, విహారి నాయకత్వంలో సాధించిన విజయాలే దానికి నిదర్శనమని లేఖలో వెల్లడించారు. ఫిర్యాదు చేసిన ఆటగాడు తప్ప మిగతా వారంతా విహారి పక్షానే నిలిచినా, ఏసీఏ మాత్రం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఆయనను కెప్టెన్సీ నుంచి తొలగించడం వైసీపీ నాయకుల దాష్టీకానికి పరాకాష్ఠగా నిలిచింది.

ఓవైపు విహారికి జరిగిన అన్యాయంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతూ, అతడికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండగా ఏసీఏ మాత్రం ఈ వ్యవహారంపై బాధితుడైన అతడి మీదే విచారణకు సిద్ధమైంది. ఇదే సమయంలో విహారి ఆరోపణలపై వివరణ ఇచ్చింది. విహారి జాతీయ క్రికెట్ జట్టుకు పరిశీలనలో ఉన్న ఆటగాడు కావడంతో రంజీ సీజన్ మొత్తం ఆయన అందుబాటులో ఉండటం కష్టమవుతోందని, ఆయనకు బదులు మరొకరిని కెప్టెన్‌గా నియమించాలని సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ నుంచి మాకు ఈమెయిల్ వచ్చిందని అందుకే కెప్టెన్‌గా తొలగించామని ఏసీఏ తెలిపింది.

విద్యార్థుల పాలిట గుదిబండలా "ఆడుదాం ఆంధ్రా"- జగన్‌ సర్కార్‌ బలవంతపు ఎన్నికల ఆటకు పిల్లలు బలి

వైసీపీ నాయకులు కబంధ హస్తాల్లో ఏసీఏ:ఏసీఏని వైసీపీ నాయకులు తమ కబంధ హస్తాల్లో బంధించేశారు. దాన్ని కుటుంబ కంపెనీగా మార్చేశారు. ఏసీఏకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి ఉపాధ్యక్షుడిగా, అల్లుడి అన్న, దిల్లీ మద్యం కేసులో నిందితుడు శరత్ చంద్రారెడ్డి అధ్యక్షుడిగా, విశాఖకు చెందిన వస్త్రవ్యాపారి, సాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడు గోపీనాథ్ రెడ్డి కార్యదర్శిగా ఉన్నారు. తన వస్త్ర వ్యాపార సంస్థకు ఆడిటర్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తినే గోపీనాథ్ రెడ్డి ఏసీఏ కోశాధికారిగా నియమించారు. మొత్తం ఏసీఏని గుప్పిట్లో పెట్టుకుని గోపీనాధ్‌రెడ్డి అనేక అక్రమాలకు, నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.

కోర్టుల్లో పలు కేసులు నడుస్తున్నాయి. సాధారణంగా ఏ రాష్ట్ర రంజీ జట్టులోనైనా 15 మంది సభ్యులే ఉంటారు. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రా రంజీ జట్టులోనే 17 మంది ఉండేలా వైసీపీ ప్రభుత్వం వచ్చాకే ఏసీఏ మార్పులు తెచ్చింది. వారిలో 15 మందిని మాత్రమే సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుందని, మిగతా ఇద్దర్నీ సెక్రటరీ కోటాలో నియమిస్తారని సమాచారం. విహారిపై ఫిర్యాదు చేసిన పృథ్వీరాజ్ అలా సెక్రటరీ కోటాలో జట్టులోకి వచ్చినవాడే. అతని తండ్రి నర్సింహాచారికి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయి.

ABOUT THE AUTHOR

...view details