CPI Ramakrishna on Assembly Sessions: వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్టుల తరఫున ఎవరూ ప్రతినిధులు లేకపోవడంతో అధికార పార్టీని ప్రశ్నించే వారే లేరన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా అధికార పక్షంలో ఉన్నారన్నారు. వైఎస్సార్సీపీ ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో ప్రజల తరఫున అధికార పార్టీని ప్రశ్నించాలన్నారు.
దురదృష్టవశాత్తు రాష్ట్ర రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు, మహిళలపై విమర్శలు ఎక్కువైపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలు ఎవరు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార పార్టీ తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించాలంటే జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరయ్యి ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు.
"అధికార పార్టీ నిర్ణయాలను ప్రశ్నించడానికి జగన్ అసెంబ్లీకి వెళ్లాలి. ప్రశ్నించే వారు లేకపోతే ఏకపక్ష నిర్ణయాలు ఉంటాయి. అసెంబ్లీలో ప్రజల తరఫున వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించాలి". - కె. రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
కాగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించడంపై రామకృష్ణ ఈ విధంగా స్పందించారు. ప్రతిపక్ష నేతగా తనకు గుర్తింపు ఇవ్వడం లేదని, ఎమ్మెల్యేలాగా రెండు నిముషాల మైక్ ఇస్తే అసెంబ్లీకి వెళ్లి లాభమేంటని ఇటీవల వైఎస్ జగన్ అన్నారు. సమావేశాలు జరిగే రోజుల్లో ప్రతి రోజూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై మాట్లాడతానంటూ జగన్ పేర్కొన్న విషయం తెలిసిందే.
సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు:సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో ఉ.10 గంటలకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే తొలిరోజు సభ వాయిదా పడనుంది. అదే విధంగా సోమవారం శాసనసభ వ్యవహారాల సలహా మండలి సమావేశం జరగనుంది. ఈ సెషన్‌కు సంబంధించిన ఎజెండాను సలహా మండలి ఖరారు చేయనుంది.
10 లేదా 11 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రతిపక్ష నేతగా గుర్తించకపోతే సభకు వెళ్లబోనని ఇప్పటికే జగన్ ప్రకటించారు. అయితే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవుతారా లేదా అనే దానిపై లేని స్పష్టత రాలేదు. మండలిలో బలం ఉండడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
ఆయనగారు అసెంబ్లీకి రారంట - ఇంట్లో కూర్చుని రికార్డు వీడియోలు వదులుతాడంట