Court Allows Distribution of Agrigold Assets to Victims:అగ్రిగోల్డ్ బాధితుల ఏళ్ల నిరీక్షణ ఫలించింది. వారికి న్యాయం చేసేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఈడీ జప్తు చేసిన సంస్థ ఆస్తుల్ని బాధితులకు పంచేందుకు కోర్టు అనుమతించింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.6 వేల కోట్ల ఆస్తులను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం గత ఏడాది డిసెంబర్‌లో నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానంలో ఈడీ పిటిషన్ దాఖలు చేయగా అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈడీ జప్తు చేసిన ఆస్తులను ఏపీ సీఐడీకి బదిలీ చేయనున్నారు.
అగ్రిగోల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రజల నుంచి వందల కోట్ల డిపాజిట్లు వసూలు చేసింది. లాభాలు ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయా రాష్ట్రాల్లో 2015లో కేసులు నమోదయ్యాయి. ఏపీలో నిధుల మళ్లింపు కోణం ఉండటంతో 2018లో ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. అప్పటి మార్కెట్ ప్రకారం సంస్థకు చెందిన రూ.4,141 కోట్ల 20 లక్షల రూపాయల విలువైన 2,310 ఆస్తులను జప్తు చేసింది. వీటిలో 2,254 ఆస్తులు ఏపీలో ఉండగా తెలంగాణలో 43, కర్ణాటకలో 11, ఒడిశాలో 2 ఉన్నాయి. అప్పటికే ఏపీ సీఐడీ కూడా ఈ ఆస్తులను జప్తు చేసింది. దీంతో తాము జప్తు చేసిన ఆస్తులను బాధితులకు అందించేలా అనుమతివ్వాలంటూ ఈడీ నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తాజాగా సమ్మతించింది.