Prakasam District Cooperative Societies Scam :ప్రకాశం జిల్లాలో సహకార వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలో 93 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా రుణాలు అందిస్తారు. సొసైటీ ద్వారా రైతులకు రుణాలు ఇచ్చి రికవరీ చేయాల్సి ఉంటుంది. రుణాలుగా ఇవ్వడం ద్వారా వచ్చే వడ్డీతో సొసైటీలు నిర్వహణ చేసుకోవాలి. రైతులకు ఇచ్చిన రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నా సొసైటీ సిబ్బంది వాటిని జమచేయని పరిస్థితి నెలకొంది.
Cooperative Societies Irregularities :ఆయా సొసైటీలకు అధ్యక్షులుగా ఉన్న నేతలు ఈ నిధులను సిబ్బందితో కలిసి గోల్‌మాల్ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.30 కోట్ల వరకూ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. గత పాలకలు తమ పార్టీ నాయకులతో త్రీమెన్, సెవెన్ మెన్ కమిటీలు వేసి జిల్లా సహకార సంఘాలను ఆడించారు. అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులు, అధ్యక్షులను కాపాడుతూ సహకార సంఘాలను ఆర్థికంగా దెబ్బతీశారనే విమర్శలు ఉన్నాయి.
"వడ్డీ కట్టాలని చెప్పారు. వడ్డీ డబ్బులు చెల్లించాను. వాటిని జమచేయలేదు. ఎవరికి రుణాలు ఇవ్వడం లేదు. చాలా మంది డిపాజిట్లు పోయాయి. మా వద్ద ఉన్న ఆధారాలను దర్యాప్తు అధికారులకు ఇచ్చాం. వారు మా దగ్గరి నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఈ కుంభకోణాన్ని వెలికి తీయాలని కోరుతున్నాం. - బాధితులు