ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిక్కులు తొలగితే విలీనానికి మార్గం సుగమం - విశాఖ ఉక్కుపై సర్వత్రా ఆసక్తి - Visakha Steel Merger with SAIL - VISAKHA STEEL MERGER WITH SAIL

Controversy over Visakha Steel Plant Merger with SAIL: సెయిల్‌లో విశాఖ ఉక్కు విలీనంపై అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆర్థికంగా ఉన్న చిక్కులు కొంతవరకు తగ్గించుకొని స్టీల్ మంత్రిత్వశాఖ నుంచి ఆమోదం పొందగలిగితే విలీనానికి మార్గం సుగమమవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇదే సమయంలో కార్మికులను అశాంతికి గురికానివ్వకుండా ఉంటేనే పని సానుకూలమవుతుందని అంచనా.

visakha_steel_merger_with_sail
visakha_steel_merger_with_sail (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 1, 2024, 3:55 PM IST

Updated : Oct 1, 2024, 5:15 PM IST

Controversy over Visakha Steel Plant Merger with SAIL:విశాఖ ఉక్కు కర్మాగారం ప్రస్తుత సంక్షోభ స్థితిని గట్టెక్కించేందుకు సెయిల్‌లో విలీనం ఏ రకంగా సానుకూలమవుతుందన్న అంశంపై పరిశ్రమ యావత్తూ ఊపిరి బిగబట్టి మరీ ఎదురుచూస్తోంది. గతంలో సెయిల్‌లో విలీనం చేస్తామన్నప్పుడు కార్మిక సంఘాలు తీవ్రంగా అడ్డుపడ్డాయి. ఆర్​ఐఎన్​ఎల్​(Rashtriya Ispat Nigam Limited)గానే ఉండాలని అన్నివైపుల నుంచి ఒత్తిడి తీసుకొచ్చాయి. ఫలితంగా అది నిలిచిపోయినా 2021లో విశాఖ ఉక్కు నుంచి వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అప్పటి నుంచి ఉక్కు పరిశ్రమలో పరిణామాలు వేగంగా మారుతూ వస్తున్నాయి.

చిక్కులు తొలగితే విలీనానికి మార్గం సుగమం - విశాఖ ఉక్కుపై సర్వత్రా ఆసక్తి (ETV Bharat)

సొంత గనులు లేని ప్రభుత్వ రంగ ఉక్కు కర్మాగారం కావడం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ప్రధాన లోటుగా చెప్పాలి. ముడిసరకు కోసం అయితే విదేశాలు లేదా దేశీయంగా కొన్ని గనుల నుంచి తక్కువ నాణ్యత కలిగిన బొగ్గును కొనుగోలు చేస్తూ ఉక్కును ఉత్పత్తి చేస్తోంది. తరచుగా ఎదురవుతున్న ముడిసరకు కొరత విశాఖ ఉక్కును సమస్యల వలయంలోకి నెట్టేస్తోంది. గతంలో చేసిన రుణాలకు వడ్డీల చెల్లింపు భారమైంది. అత్యధిక ఉత్పత్తి సాధించినప్పటికీ ఏవైపు నుంచీ సాయం అందకపోవడం మరోవైపు పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్రం చురుగ్గా చర్యలు చేపట్టడం వెరసి స్టీల్‌ప్లాంట్‌ను నష్టాల కడలిలో పడేశాయి.

అగమ్యగోచరంగా కార్మికుల జీవితాలు: ఎన్నికల సమయంలో అన్నిపార్టీలు విశాఖ ఉక్కును పరిరక్షిస్తామని గట్టిగా హామీలు ఇచ్చాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక దీనిపై విస్పష్ట ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ప్లాంట్‌ను ఆర్థికంగా బలోపేతం చేసే చర్యల్లో భాగమంటూ సిబ్బంది తగ్గింపు, వీఆర్​ఎస్​ వంటివి కార్మిక లోకాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇటీవలే 4 వేల మంది ఒప్పంద కార్మికులను తొలగించడంతో వారి జీవితాలు అగమ్యగోచరంగా మారాయంటూ కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో విశాఖ ఉక్కు కర్మాగారం సీఎండీ అతుల్‌ భట్‌ పదవీకాలం మరో 2 నెలలు ఉండగానే సెలవులపై వెళ్లడం అనుమానాలకు తావిచ్చింది. మంత్రిత్వశాఖే ఆయన్ని సెలవుపై వెళ్లమని కోరిందన్న ప్రచారం సాగింది. ఇన్‌ఛార్జ్‌ సీఎండీగా బాగ్చికి బాధ్యతలు ఇచ్చారు.

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్​ సెయిల్‌లో విలీనం? కేంద్రం మదిలో ఇదే ఉందా? - vizag steel plant Merge With sail

సంబంధం లేని భూముల విక్రయాలకు చర్యలు:ఈ తరుణంలోనే స్టీల్‌ ప్లాంట్‌కు ఉన్న అత్యంత విలువైన భూ బ్యాంక్‌ ఏ రకంగానూ బదలాయింపు కాకుండా చూడాలని స్టీల్‌ ప్లాంట్‌ మంత్రాంగం జరిపింది. ఆర్థికంగా కొంత నిలదొక్కుకునేందుకు ఇది ఉపకరిస్తుందని భావించింది. స్టీల్‌ ప్లాంట్‌కు సంబంధం లేని భూముల విక్రయాలకు చర్యలు చేపట్టింది. మరోవైపు దాదాపు 1600 ఎకరాల స్థలాన్ని ఎన్​ఎండీసీకి లీజుకు ఇచ్చి వారు పిల్లెట్స్‌ ప్లాంట్‌ పెట్టుకునేట్లు చూస్తోంది. గతంలో తమకు బకాయిపడ్డ 3 వేల కోట్ల రూపాయల్లో భూమి లీజును మినహాయించుకోవాలని ఎన్​ఎండీసీ స్పష్టం చేసింది. దీంట్లో మంత్రిత్వశాఖ కలగజేసుకుని స్టీల్‌ప్లాంట్‌కు 500 కోట్లు ఇవ్వాలని ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. స్టేట్‌ బ్యాంక్‌తో ఈ భారీ మొత్తం ఇప్పించేందుకు సిద్ధమైంది.

కార్మిక లోకం ఆందోళన: గత నెలలో రైల్వేకు విక్రయించిన రాయ్‌బరేలీ వీల్‌ ప్లాంట్ కోసం దాదాపు 1500 కోట్ల రూపాయలు జమకాగా వాటిని బ్యాంకు కిస్తీగా ఎస్బీఐ హోల్డ్‌లో ఉంచింది. స్టీల్‌ ప్లాంట్‌కు రిజర్వులో ఉన్న 8 వేల ఎకరాల భూమిని ఆదుకునే విషయంలోనూ ఉక్కు మంత్రిత్వశాఖ వ్యహాత్మకంగా వ్యవహరించాలన్నది ప్రధానమైన అంశం. సెయిల్‌లో విలీనం సానుకూలాంశంగా అందరినోటా నానుతున్న వేళ కాంట్రాక్టు కార్మికుల తగ్గింపు, శాశ్వత ఉద్యోగులను వేరే చోటికి పంపడం వంటివి ఉత్పత్తి నష్టానికి కారణమవుతాయని కార్మిక లోకం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వీటన్నింటికీ సమాధానాలిస్తేనే స్టీల్‌ ప్లాంట్‌ భూముల విక్రయం లేదా బదలాయింపు వంటి చర్యలు ఆర్థికంగా ఉపకరిస్తాయన్నది వీరి వాదన. ఒకట్రెండు వారాల్లో స్టీల్‌ప్లాంట్‌కు ఇప్పుడున్న అనిశ్చితి తొలగి సెయిల్‌లో విలీనానికి మార్గం సుగమం కావాల్సి ఉంది.

రాష్ట్రంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు - అన్ని జిల్లాలకు ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ: లోకేశ్ - Lokesh Speech Visakha CII Summit

జీవీఎంసీ సమావేశంలో వైఎస్సార్​సీపీ కార్పొరేటర్ నోటిదురుసు - తోపులాట - Argument in GVMC Meeting

Last Updated : Oct 1, 2024, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details