Congress Strategy on Lok Sabha Elections :పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీబలోపేతంతోపాటు అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఉమ్మడి జిల్లాల పరిధిలోని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ బలబలాలపై జిల్లా, ఇంఛార్జీమంత్రులతో ఆరాతీశారు. ఈనెల 26 నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. బూత్‌స్థాయిలోని ఏజెంట్లు కీలకంగా వ్యవహరించడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించామన్న భావన కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో వారి సేవలను సమర్ధంగా వినియోగించుకునేలా నాయకత్వం ప్రణాళికలు సిద్దంచేస్తోంది. అందులో భాగంగా గురువారం బూత్‌స్థాయి ఏజెంట్లతో ఎల్బీస్టేడియంలో ఏఐసీసీ (AICC President) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశం కానున్నారు.
ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్ రాష్ట్రనాయకత్వం వేట సాగిస్తోంది. మొత్తం 17 స్థానాల్లో ఇద్దరు నుంచి నలుగురు టికెట్ ఆశిస్తున్నారు. వరంగల్ స్థానం ఎస్సీకి రిజర్వ్ అయినందున అద్దంకి దయాకర్‌ని బరిలో దింపే యోచనలో ఉండగా మరో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య టికెట్ ఆశిస్తున్నారు. నాగర్‌కర్నూల్ నుంచి పోటీకి సంపత్‌కుమార్, మల్లురవితోపాటు చారకొండ వెంకటేశ్ చొరవచూపుతున్నారు. ఎస్టీ రిజర్ట్ స్థానాలైన ఆదిలాబాద్ నుంచి నరేష్ జాదవ్, సేవాలాల్ రాథోడ్ మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, మాజీ పోలీస్‌అధికారి కాశీరాంనాయక్ టికెట్ ఆశిస్తున్నారు.
'కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోం'- ఒకే రోజు షాక్ ఇచ్చిన ఆప్, టీఎంసీ
Sonia Gandhi in MP Election at Khammam : ఖమ్మం నుంచి పోటీకి ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ(Sonia Gandhi)చొరవ చూపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆమె రాకపోతే రేణుకాచౌదరి, వీహెచ్, పొంగులేటి ప్రసాద్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన ఫిరోజ్‌ఖాన్, అజహరుద్దీన్(Azaruddin)తో పాటు పొత్తులో భాగంగా ఎంబీటీకి ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. కరీంనగర్ నుంచి ప్రవీణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్‌వార్ రూమ్‌లో కీలకంగా పనిచేసిన సంతోష్‌రుద్ర మహిళ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు నేరెళ్ల శారద టికెట్ ఆశిస్తున్నారు.