Abhishek Singhvi Nomination Date :తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా పోటీచేస్తున్న అభిషేక్ మను సింఘ్వీ ఈ నెల 19న నామినేషన్ వేసే అవకాశమున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన పేరును ఖరారు చేసి ప్రకటించింది. ఇవాళ దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని అభిషేక్ మను సింఘ్వి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ నెల 18న సీఎల్పీ సమావేశం! :ఈ నెల 18వ తేదీన పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఓ ప్రైవేటు హోటల్లో సీఎల్పీ సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎల్పీ సమావేశం రోజు అభిషేక్ సింఘ్వీని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పరిచయం చేయడంతో పాటు ప్రభుత్వ నిర్ణయాలు, భవిష్యత్ కార్యచరణపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా సింఘ్వీ ఒక్కరే నామినేషన్ వేసినట్లయితే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. కానీ కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన స్థానం కావడంతో బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిని బరిలోకి దింపినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.