Congress Govt on Gas Cylinder Scheme :రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీ అమలుపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణలోని గ్యాస్ డీలర్లు రూ.500కే సిలిండర్ పథకం అమలుకు సిద్ధం కావాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. గురువారం జరిగిన కేబినేట్ సబ్ కమిటీ భేటీలో ఈ పథకంపై గ్యాస్ డీలర్లతో చర్చించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు.
Officers on 500 Rupees Gas Cylinder Scheme :దీంతో వెంటనే పౌర సరఫరాల శాఖ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సివిల్ సప్లయ్స్ భవన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో కమిషనర్ డీఎస్ చౌహాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీగా రాష్ట్ర సర్కార్ డీలర్లకు చెల్లించే మొత్తానికి జాతీయ బ్యాంకు అగ్రిగేటర్‌గా వ్యవహరించనున్నట్లు తెలిసింది.
గ్యాస్ సిలిండర్ ఎక్స్పైరీ డేట్ ఎలా చెక్ చేయాలో తెలుసా?
తెలంగాణలో 1.20 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో రేషన్‌కార్డు ఉన్నవారి సంఖ్య 89.99 లక్షలు. ప్రాథమిక అంచనా మేరకు ప్రస్తుతం 39.50 లక్షల మందిని సబ్సిడీ గ్యాస్ పథకానికి అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ పథకానికి ఆధార్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరిగి సిలిండర్ కనెక్షన్ పాస్‌బుక్, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డును పరిశీలించి ఆ వివరాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఇంటింటి సర్వే పూర్తయ్యాక అర్హుల సంఖ్య పెరిగే అవకాశం ఉండనుంది.
Mahalakshmi Gas Cylinder Scheme in Telangana :పథకం అమల్లోకి వచ్చిన రోజు నుంచి అర్హులైన వినియోగదారులకు రూ.500కే గ్యాస్ సిలిండర్ (500 Rupees Gas Cylinder Scheme ) ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ డీలర్లకు స్పష్టం చేసింది. మిగిలిన మొత్తాన్ని తెలంగాణ సర్కార్ చెల్లిస్తుందని వివరించగా డీలర్లు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. డీలర్ల సంఘం ప్రతినిధులు తమ సందేహాలను వ్యక్తంచేయడంతో పాటు కొన్ని సలహాలు ఇచ్చారు.