తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్లుండి నుంచి కుటుంబ సర్వే - పట్నంలో ఉండే పల్లెవాసులు ఇలా చేయాల్సిందే! - COMPREHENSIVE FAMILY SURVEY IN TG

సమగ్ర కుటుంబ సర్వేలో తొలిరోజు ఇంటి నంబర్, యజమాని పేరు నమోదు చేసిన గణకులు - రేపటి వరకు పూర్తి కానున్న ప్రక్రియ - ఈనెల 9 నుంచి రెండోదశ సమగ్ర కుటుంబ సర్వే

Comprehensive Family Survey
Comprehensive Family Survey (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 7, 2024, 7:31 AM IST

Comprehensive Family Survey :రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేలో తొలి దశ బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రంలో మొదటి రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికార కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 9న ప్రారంభించి నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటగా ఇంటి నంబరు, అందులో నివసించే యజమాని పేరు నమోదు చేసే ప్రక్రియ సాగింది. ఇందులో ఒక్కో గణకుడికి 150 నుంచి 175 ఇళ్ల దాకా కేటాయించగా, వారు శుక్రవారం వరకు ఆ వివరాలను నమోదు చేస్తారు.

అప్పటికల్లా రాష్ట్రంలో మొత్తం ఎన్ని ఇళ్లు ఉన్నాయో, వాటిలో ఎన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయో అనే జాబితా సిద్ధమవుతుంది. అప్పుడు ఆ వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేస్తారు. ఈ సమాచారం ఆధారంగా ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబంలోని సభ్యులందరి సమగ్ర వివరాలు సేకరించి నమోదు చేసుకుంటారు.

తొలి రోజు నమోదు ప్రక్రియ :తొలిరోజు ఇంటి నంబరు, నివసించే యజమాని పేరు వంటి వివరాలు నమోదు చేసుకున్న తర్వాత గణకులు ఆయా ఇళ్లకు స్టిక్కర్లు అంటించారు. అందులో ఆదిలాబాద్​ జిల్లాలో మొత్తం 11,97,554 ఇళ్లకు గానూ 95,106(48 శాతం) ఇళ్లకు తొలిరోజే స్టిక్కర్లును అంటించినట్లు జిల్లా అధికారులు తెలిపారు.

మొత్తం సర్వే విధానం ఇలా :రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉన్నాయి. ఎన్యూమరేషన్​ బ్లాక్​లుగా 87,092 ఇళ్లను విభజించినట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ తెలిపింది. ఇందులో గ్రేటర్​ హైదరాబాద్​లోనే మొత్తం 28,32,490 కుటుంబాలు నివాసం ఉండగా, వాటిని 19,328 ఎన్యూమరేషన్​ బ్లాక్​లుగా విభజించడం జరిగింది. మొత్తం సర్వే పూర్తి చేయడానికి 94,750 మంది గణకులు, వారిపై 9,478 మంది సూపర్​వైజర్లను ప్రభుత్వం నియమించింది.

సమగ్ర కుటుంబ సర్వేపై కొన్ని ఫిర్యాదులు :

  • బీసీ - బీ జాబితాలో 84 కులాలకు కోడ్​లను కేటాయించారు. కానీ వాటిలో విశ్వబ్రాహ్మణ కులానికి ప్రత్యేక కోడ్ కేటాయించాలని ఈ సామాజిక వర్గానికి చెందిన వారు కోరారు. కులం ఉన్న చోటనే విశ్వబ్రాహ్మణ అని, వృత్తి ఏదైతే అది అక్కడ నమోదు చేసేలా మార్పులు చేయాలన్నారు.
  • ఆదిలాబాద్​ జిల్లాలో పరదాన్​ కులస్థులు ఎస్టీ జాబితాలో ఉన్నారు. కానీ సర్వే వివరాల్లో మాత్రం పరదాన్ కులానికి ప్రత్యేక కోడ్​ లేదని, ఇతరులు అని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

స్వగ్రామం వదిలి పట్టణంలో నివసిస్తున్న వారి పరిస్థితి? :రాష్ట్రంలో పలు కుటుంబాలు తమ స్వగ్రామంలో ఇల్లు ఉన్నా, చదువు, ఉద్యోగం, వ్యాపార రీత్యా నగరాలు, సమీప పట్టణాల్లో నివాసం ఉంటున్నారు. ఇలాంటి వారు ఎక్కడ కుటుంబ వివరాలు నమోదు చేసుకోవాలనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఆదిలాబాద్​ జిల్లా అధికారులు మాత్రం ఆధార్​ కార్డులో ఎలా చిరునామా ఉంటే అక్కడ వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. కానీ ప్రణాళిక శాఖ అధికారిని ఈ విషయంపై అడగ్గా ప్రజలకు సులభంగా ఉండేలా ఒకటి రెండు రోజుల్లో కలెక్టర్లకు మార్గదర్శకాలు పంపిస్తామని స్పష్టం చేశారు.

రెండో దశ ఈ నెల 9 నుంచి ప్రారంభం : మొదటి దశలో ఇంటి నంబరు, కుటుంబ యజమాని పేర్లను నమోదు చేసుకుంటున్న సర్వే అధికారులు, రెండో దశలో 75 ప్రశ్నలు అడిగి తెలుసుకోనున్నారు. రెండో దశ ఈ నెల 9 నుంచి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం అవుతుంది. ఈ వివరాలను కంప్యూటరీకరణ చేస్తారు. గణకులు ఇంటికి వచ్చే సమయంలో ఆధార్​, రేషన్​ కార్డులు సిద్ధంగా ఉంచుకుంటే వాస్తవ సమాచారం తెలుస్తుందని ప్రభుత్వం ప్రజలకు సూచించింది.

ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వే - ఆ పత్రాలను దగ్గర ఉంచుకోవాలని అధికారుల సూచన

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో అడిగే ప్రశ్నలు ఇవే - ఆ పత్రాలన్నీ దగ్గర ఉంచుకోండి

ABOUT THE AUTHOR

...view details