GST Refund Fraud in Telangana Updates 2024 : వాణిజ్య పన్నుల శాఖలో సంచలనం రేపిన బోధన్ నకిలీ చలానాల కుంభకోణం తర్వాత జీఎస్టీ రీఫండ్‌ల కుంభకోణమే అతిపెద్దది. బీఆర్ఎస్ హయాంలో వాణిజ్య పన్నుల శాఖపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు సిబ్బంది అక్రమార్కులతో కుమ్మక్కై, ఆదాయానికి గండికొట్టడమే కాకుండా ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టిన విషయం బయటపడుతోంది.
తవ్వేకొద్దీ వెలుగులోకి అక్రమాల బాగోతం : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, మీరట్ కేంద్ర జీఎస్టీ విభాగమైన డీజీజీఐ అధికారులు ఎలక్ట్రిక్ వాహనాల క్రయవిక్రయాలపై ఆయా సంస్థలు వేసిన ఇన్‌వాయిస్‌లపై అనుమానం వచ్చి తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖను అప్రమత్తం చేశారు. ఈ విషయంపై వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి తీగలాగగా డొంకకదిలింది. తవ్వేకొద్దీ అక్రమాల బాగోతం వెలుగులోకి వస్తోంది.
GST Refund Scam in Hyderabad : ఇప్పటికే మూడు డివిజన్ల పరిధిలో ప్రాథమిక సమాచారం మేరకు, దాదాపు రూ.100 కోట్ల జీఎస్టీ రీఫండ్‌ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మరో 11 డివిజన్ల పరిధిలో అనుమానస్పద రీఫండ్‌ల పరిశీలన చేయాలని వాణిజ్య పన్నుల శాఖ యోచిస్తోంది. ఆ పరిశీలన పూర్తైతే ఎందరు సిబ్బంది అక్రమార్కులతో కుమ్మక్కై ప్రభుత్వ సొమ్మును ఎంత దోచేశారో లెక్క తేలనుంది.
GST Frauds in Telangana : జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవడం తద్వారా వ్యాపార లావాదేవీలు చేసినట్లు కాగితాలపై ఇన్‌వాయిస్‌లు సృష్టించి నెట్‌వర్క్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఎక్కువ శాతం జీఎస్టీ కలిగిన వస్తువులను కొనుగోలు చేసినట్లు చూపి, తక్కువ జీఎస్టీ పరిధిలో వస్తువులను విక్రయాలు చేసినట్లు చూపి ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వం నుంచి రీఫండ్‌ల కింద తీసేసుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఫేస్‌పౌడర్, బ్యాటరీలు, స్క్రాప్ తదితరాలు వ్యాపారం చేసినట్లు చూపి సర్కార్ సొమ్మును దాదాపు వంద కోట్లు ఇలా తీసేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది.
వ్యాపారం చేయకుండానే చేసినట్లు చూపి : ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి మూడు సంస్థలు కలిసి రూ.46 కోట్లకు పైగా మొత్తాన్నిరీఫండ్ తీసుకున్నాయి. అందులో ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఐదుగురు అరెస్ట్ కాగా, నలుగురు బయటివారు ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ట్యాక్స్ కన్సల్టెంట్ దేశవ్యాప్తంగా బోగస్ సంస్థలు తెరచి, వ్యాపారం చేయకుండానే చేసినట్లు చూపి ప్రభుత్వ సొమ్ము దోచేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ కేసుకు సంబంధించి పోలీసులు మరింత లోతైన విచారణ కొనసాగిస్తున్నారు. సిమెంట్ బస్తాలు కొనుగోలు చేసి, ఆ స్థానంలో టాల్కమ్ పౌడర్ విక్రయాలు చేసినట్లు చూపి రూ.14 కోట్లకి పైగా మొత్తాన్ని జీఎస్టీ రీఫండ్ కింద తీసుకున్నారు. ఆ కేసులో సంబంధించి డీసీటీవో సస్పెండ్ కాగా, ఆ సంస్థ అధినేతను అరెస్ట్ చేశారు.