తెలంగాణ

telangana

ETV Bharat / state

పందెం కోడి పండక్కి రెడీ - తగ్గేదేలే అంటున్న పందెం రాయుళ్లు - SANKRANTHI KODI PANDALU MANCHIRIAL

సంక్రాంతి పండుగకు జోరుగా కోళ్ల పందేలు - ఎక్కడ ఆడుతున్నారో తెలీకుండా జాగ్రత్తపడుతున్న పందెం రాయుళ్లు - ఒక్కో కోడిపుంజు రూ. 5వేల నుంచి రూ. 30 వేలు

cockfights in Manchirial
Sankranthi Kodi Pandalu In Manchirial (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2025, 2:46 PM IST

SankranthiKodi PandaluIn Manchirial :సంక్రాంతి అనగానే పిండి వంటలు, గాలిపటాలే కాదు కోడి పందేలు కూడా గుర్తుకొస్తాయి. పండుగ సమీపిస్తున్న తరుణంలో వాటి వేట మొదలైంది. బరిలో దిగిన కోడి గెలిస్తే ప్రపంచాన్ని గెలిచిన సంతోషం. అదే ఓడిపోతే తట్టుకోలేని అవమానం. అయితే ఈ సంస్కృతి కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. రూ. వందల్లో మొదలైన పందెం రానురానూ వేలల్లోకి చేరింది. ఇప్పటికే అక్కడక్కడ పోలీసులు వీటిపై నిఘా పెట్టినా పందెం రాయుళ్లు తగ్గేదేలే అంటున్నారు.

మంచిర్యాల జిల్లాలో కోడి పందాలు: మంచిర్యాల జిల్లా ప్రాణహిత తీర ప్రాంతాలైన వేమనపల్లి, కోటపల్లి, జైపూర్, భీమారంలతో పాటు దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో కోడిపందేలు జోరుగా కాస్తున్నారు. ఇందులో పాల్గొనేవారికి తప్ప కొత్తవారికి ఎక్కడ ఆడుతున్నారో తెలీకుండా జాగ్రత్తపడుతారు. ఒక్కో రోజు ఒక్కో చోట ఆటను మార్చుతున్నారు. పోటీల్లో కోడితో పాల్గొనడానికి రూ. 500, వీక్షించేందుకు రూ. 300 వసూలు చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా పోటీలకు వచ్చిన మొబైల్స్ లోనికి అనుమతించడం లేదు. ఇప్పటికే కోళ్ల పందేలు మొదలుకాగా సంక్రాంతి పండగ వరకు కొనసాగనున్నాయి. చాలామంది పెద్దపల్లి జిల్లాతో పాటు మహారాష్ట్రలోని సిరోంచాకు వెళ్లి కోడి పందాలు ఆడుతున్నారు.

పోటీలు తిలకించేందుకు ప్రత్యేక ప్యాకేజీ : ఆంధ్రప్రాంతంలో పోటీలు నేరుగా తిలకించడంతో పాటు పాల్గొనే ఆసక్తి ఉన్నవారి కోసం కొందరు ప్రత్యేకంగా ప్యాకేజీ పెట్టారు. జిల్లా కేంద్రానికి చెందిన కొందరు ఆంధ్రకు తీసుకెళ్లడంతోపాటు అక్కడ వసతి, భోజన సదుపాయాలు, కోడి పందెం, జూదం నిర్వహించేందుకు రుసుము పేరిట వసూలు చేస్తున్నారు. ఈ ప్యాకేజీని నిర్వాహకులు తమ సామాజిక మాధ్యమాల్లో పెట్టడం గమనార్హం.

పందెం కోళ్ల ధరలు : పోటీల్లో తలపడే కోడిపుంజులకు చాలా డిమాండ్ పెరిగింది. ఆంధ్రప్రాంతంతో పాటు కరీంనగర్‌ నుంచి వీటిని అధిక ధరలు పెట్టి తీసుకొస్తున్నారు. మరి కొంత మంది పందెం కోసం కొన్ని రోజుల ముందు నుంచి కోళ్లను ప్రత్యేకంగా పెంచుతున్నారు. ఒక్కో కోడిపుంజు రూ. 5వేల నుంచి రూ. 30 వేల వరకు పలుకుతోంది. ఒక్కో ఆటలో రూ. 5వేల నుంచి రూ. 25 వేల వరకు పందెం కాస్తున్నారు. పోటీలో చనిపోయిన కోళ్లను తినేందుకు చాలామంది ఇష్టపడుతుండటంతో వాటికి డిమాండ్‌ బాగానే ఉంది.

తగ్గేదే లే అంటున్న పందెం కోళ్లు - ఒక్కోదాని ధర తెలిస్తే షాక్!

వారికి హైకోర్టు నిబంధనలు పట్టవ్ అంతే - జోరుగా కోడి పందేలు, గుండాట

ABOUT THE AUTHOR

...view details