CM Revanth Speech at 16th Finance Committee Meeting : దేశంలోనే తెలంగాణ వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని, దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన 16వ ఆర్థక సంఘం సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని, ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, భారీ రుణ భారం తెలంగాణకు భారంగా మారిందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణభారం రూ.6.85 లక్షల కోట్లకు చేరుకుందని, ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్ బడ్జెట్ రుణాలు ఉన్నాయని గుర్తు చేశారు. గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుందని అన్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రుణాలు, వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రుణాల సమస్యను పరిష్కరించేందుకు తమకు తగిన సహాయం, మద్దతు ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘాన్ని సీఎం రేవంత్ కోరారు. రుణాన్ని రీ స్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలని లేదా తమకు అదనపు ఆర్థిక సహాయాన్ని అందించాలని వేడుకున్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలన్నారు. అన్ని రాష్ట్రాల తరఫున ఈ డిమాండ్‌ను ముందు ఉంచుతున్నామన్నారు.