CM Revanth Reddy Launch BFSI Course Today :రాష్ట్రంలోనిరుద్యోగుల సమస్యను గుర్తించామని, అన్ని శాఖల్లో భర్తీ ప్రక్రియ చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విరివిగా కల్పిస్తున్నామని చెప్పారు. యువతకు ఉపాధి కల్పనే పరమావధిగా ప్రభుత్వం రూపొందించిన బీఎఫ్ఎస్ఐ స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 38 డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసులు, ఇన్సూరెన్స్ రంగ సంస్థలకు అవసరమైన శిక్షణను బీఎఫ్ఎస్ఐ కోర్సు ద్వారా అందించనున్నారు.
బీఎఫ్ఎస్ఐ కన్షార్టియం, ఎక్విప్ సంస్థల సహకారంతో ఈ విద్యా సంవత్సరం నుంచే మొత్తం 10వేల మంది విద్యార్థులకు ఈ కోర్సును అందించనున్నారు. ఇక ఇందుకోసం అయ్యే ఖర్చు నిమిత్తం రూ.2.5 కోట్లను సీఎస్ఆర్ కింద ఎక్విప్ సంస్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించింది. కార్యక్రమంలో భాగంగా బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రాంకు సంబంధించిన వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
గత పదేళ్ల కాలంలో నిరుద్యోగ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు :ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సరైన ఉపాధి మార్గాలు లేక యువత ఇటీవల డ్రగ్ పెడలర్స్‌గా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డిగ్రీ , ఇంజినీరింగ్ విద్యార్థులకు బ్యాంకింగ్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వటం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చన్నారు. ఉపాధి కల్పన కోసమే యువత తెలంగాణ ఉద్యమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నప్పటికీ పదేళ్ల కాలంలో సమస్య మాత్రం పరిష్కారం కాలేదని మండిపడ్డారు.
నాలెడ్జ్, కమ్యూనికేషన్ ఉంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయని, చదివిన డిగ్రీకి, మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కు గ్యాప్ ఉంటోందని సీఎం తెలిపారు. బీఎఫ్ఎస్ఐకు అవసరమైన స్కిల్స్ నేర్పేందుకు కోర్సు ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇంజినీరింగ్ విద్యార్థులు జాబ్ స్కిల్స్ నేర్చుకోవడం లేదని, కొన్ని కళాశాలల్లో అధ్యాపకులు, వసతులు ఉండటం లేదని సీఎం ఆక్షేపించారు. కళాశాలలు ఇలాగే కొనసాగితే గుర్తింపు రద్దు చేసేందుకు వెనుకాడమని హెచ్చరించారు. త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ, యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఔత్సాహిక క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని వివరించారు.