Kurian Committee Meeting Over Parliament Result : బీఆర్ఎస్ ఓట్లను, బీజేపీకి బదిలీ చేయడం వల్లే లోక్‌సభ స్థానాల సంఖ్య అంచనాలకు తగ్గట్లు రాలేదని రాష్ట్ర కాంగ్రెస్ కురియన్ కమిటీకి నివేదించింది. 2014 నుంచి 2024 వరకు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన సీట్లు, ఓట్ల శాతాలతో ఏడు పేజీల నివేదిక అందజేసింది. 2014లో 24 శాతంగా ఉన్న కాంగ్రెస్ ఓటర్లు, లోక్‌సభ ఎన్నికల నాటికి 40 శాతానికి పెరిగినట్లు సీఎం రేవంత్ రెడ్డి కురియన్ కమిటీకి వెల్లడించారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై నిజ నిర్ధారణకు వచ్చిన కురియన్ కమిటీ, అభిప్రాయ సేకరణ ముగిసింది.
రెండ్రోజుల పాటు గాంధీభవన్‌లో మకాం వేసిన కమిటీ సభ్యులు, తొలి రోజు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, గెలిచిన ఎంపీల ద్వారా అప్పటి రాజకీయ పరిణామాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా టికెట్ల కేటాయింపులో జరిగిన ఆలస్యం, మార్పులు చేర్పులతో, ఒకట్రెండు సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని నేతలు కురియన్ కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ నాయకుల మధ్య సమన్వయం కుదిర్చి, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించి ఉంటే మరో రెండు, మూడు స్థానాలు అధికంగా వచ్చేవని కొందరు అభిప్రాయపడినట్లు సమాచారం.
మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో కొందరు ఎమ్మెల్యేలు సంపూర్ణ సహకారం అందించలేదని, కురియన్ కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. నియోజకవర్గం మార్చడం వల్లే ఓటమిపాలైనట్లు మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన సునీతా మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్ స్థానాలపై కురియన్ కమిటీకి వ్యతిరేక అభిప్రాయాలు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రెండో రోజు జరిగిన కమిటీ భేటీలో 70 మందికి పైగా నాయకులు అభిప్రాయాలను తెలియజేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో కురియన్ కమిటీ సమావేశమైంది. రాష్ట్ర కాంగ్రెస్ గురించి చెప్పడం సహా నియోజకవర్గాల వారీగా అక్కడి రాజకీయ పరిస్థితులను వివరించినట్లు సమాచారం. 2014 నుంచి 2024 వరకు రాష్ట్రంలో పార్టీ ఎలా ఉందో కళ్లకు కట్టినట్లు కమిటీకి ఓ నివేదిక అందించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అంచెలంచెలుగా పార్టీ ఎలా పుంజుకుందో అందులో వెల్లడించారు. బీఆర్ఎస్ ఎలా పతనమైంది? బీజేపీ ఏ విధంగా బలం పుంజుకుందో వివరించారని తెలుస్తోంది.