Hyderabad Disaster Response and Assets Monitoring Protection :రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్, భాగ్యనగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే వర్షాకాలం వచ్చిందంటే చాలు నగరంలో ప్రధాన సమస్యగా మారిన విపత్తు నిర్వహణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. నగరంలోని చెరువులు, నాలాలు, కుంటలు ఆక్రమణలకు గురవడమే ఇందుకు కారణంగా భావించిన ప్రభుత్వం, ఈ సమస్యకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రాజధానిమహా నగరంలో విపత్తుల నిర్వహణ కోసం 'హైడ్రా' (HYDRA) (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్) అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కుల వంటి వాటిని సంరక్షించడం ఈ విభాగం పని.
హైదరాబాద్ భౌగోళిక పరిధిని విస్తరించనున్న దృష్ట్యా విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల దీనికి శ్రీకారం చుట్టారు. జీహెచ్‌ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు ఈ విభాగం సేవలు అందించనుంది. డీఐజీ స్థాయి అధికారి ఈ విభాగానికి డైరెక్టర్‌గా, ఎస్పీ స్థాయి అధికారులు అదనపు డైరెక్టర్లుగా ఉంటారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్ బోర్డు, సిటీ ట్రాఫిక్, వివిధ విభాగాల నుంచి ప్రత్యేక బృందాలు ఈ విభాగంలో పని చేస్తాయి.