CM Revanth Focus on Bifurcation Issues :వచ్చే నెల రెండో తేదీతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు సైతం ముగియనుంది. వివిధ కార్పొరేషన్లు, సంస్థల విభజన వ్యవహారం ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా కొలిక్కి రాలేదు. విభజన అంశాలపై దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి శనివారం మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.
విభజన సమయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆర్థికశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగాలను ఏర్పాటు చేశారు. విభజన చట్టం 9, 10వ షెడ్యూల్‌లలోని పలు అంశాలు ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్నాయి. తొమ్మిదో షెడ్యూల్‌లోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షిలాబిడే కమిటీ పలు సిఫార్సులు చేసింది. ఇందులో మొత్తం 91 కార్పొరేషన్లు ఉండగా, ఆర్టీసీ, ఎస్ఎఫ్సీ వంటి 23 కార్పొరేషన్లపై ఇరు రాష్ట్రాల మధ్య భిన్న వాదనలు ఉన్నాయి.
విభజన చట్టంలోని హెడ్ క్వార్టర్స్ అనే పదానికి రెండు రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం సదరు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని మాత్రమే హెడ్ క్వార్టర్స్‌గా పరిగణించాలని తెలంగాణ అంటోంది. అయితే హైదరాబాద్‌లోని సదరు కార్పొరేషన్ అన్ని కార్యాలయాలు, భవనాలను హెడ్ క్వార్టర్స్‌గా పరిగణించాలని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది. ఈ వివాదాన్ని ముగించేందుకు కేంద్ర ప్రభుత్వం హెడ్ క్వార్టర్స్ అన్న పదానికి స్పష్టతనిస్తూ తెలంగాణ వాదనను సమర్థించగా, ఏపీ దీన్ని అంగీకరించలేదు. ఇలా రెండు రాష్ట్రాల మధ్య వివిధ అంశాలకు సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు ఉండడంతో అవి అపరిష్కృతంగానే ఉండిపోయాయి.
అటు పదో షెడ్యూల్‌లో మొత్తం 142 సంస్థలు ఉండగా, తెలుగు అకాడమీ లాంటి 30 సంస్థలపై ఇరు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. విభజన చట్టం 75వ సెక్షన్ ప్రకారం స్థానికత ఆధారంగానే ఈ సంస్థలు ఆయా రాష్ట్రాలకు చెందుతాయని, అయితే నిబంధనలకు లోబడి సేవలు మాత్రం ఉపయోగించుకోవచ్చని అందులో ఉంది. కేంద్ర హోంశాఖ పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించినా ఆయా అంశాలపై ఏపీ, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలోనూ చర్చకు వచ్చినా ముందుకు కదల్లేదు.