CM Revanth Reddy Tweet on Film Stars : సినీ ప్రముఖుల ఇళ్లపై దాడులు చేయడం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఫిల్మ్ స్టార్స్ నివాసాలపై దాడులు సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ తరహా ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ జితేందర్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను ఆదేశిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించవద్దని అధికారులకు స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ ఘటనతో సంబంధంలేని పోలీసు సిబ్బంది స్పందించవద్దని, ఉన్నతాధికారులు ఈ ఘటనపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
అల్లు అర్జున్ ఇంటిపై దాడి, కోటి పరిహారం డిమాండ్ : ఆదివారం (డిసెంబరు 22న) మధ్యాహ్నం ఓయూ జేఏసీ విద్యార్థి సంఘాల ఆందోళనతో జూబ్లీహిల్స్‌లోని సీనీ నటుడు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి తక్షణమే రూ.కోటి పరిహారం చెల్లించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కొందరు అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు విసిరారు. ఆయన ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని పూల కుండీలను పగలగొట్టి ధ్వంసం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో సినీ ప్రముఖుల ఇళ్లపై దాడులను ఖండిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.