CM Revanth in KAKA Birth Anniversary Meet :సింగరేణిని కాపాడిన ఘనత కాకాకే దక్కుతుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పేదలకు 80 వేల ఇళ్లు ఇప్పించారని, అలాగే అణగారిన వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరించిన ఘనత కాకాకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన గుడిసెల వెంకటస్వామి 95వ జయంతి వేడుకలకు సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అనాటి కాకా ఇల్లే ఇప్పటి కాంగ్రెస్ జాతీయ పార్టీ కార్యాలయం ఉందని, హైదరాబాద్‌కు ఖర్గే వచ్చినప్పుడు ఆయన సేవలను గుర్తు చేసుకుంటారని ముఖ్యమంత్రి తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని కాకా సేవలను సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయనను స్పూర్తిగా తీసుకుని తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
నిర్వాసితులను ఆదుకుంటాం :మూసీ రివర్ ఫ్రంట్‌లో ఉన్నవాళ్లకు తప్పకుండా పునరావాసం కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులకు, బఫర్ జోన్‌లోని బాధితులకు ప్రభుత్వం తప్పకుండా ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తుందన్న సీఎం, విపక్షాల ఆరోపణలను నమ్మోద్దని సూచించారు. ప్రభుత్వం వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందన్న రేవంత్‌రెడ్డి, అందరిని ఆదుకుంటుందని భరోసా కల్పించారు.
ప్రతిపక్షాలు సూచనలు ఇవ్వాలి :మూసీలో ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. సబర్మతి కట్టినప్పుడు చప్పట్లు కొట్టారని, ఈటల రాజేందర్ ఈ ప్రభుత్వానికి సూచనలు ఇవ్వొచ్చన్నారు. 100 ఏళ్ల క్రితమే నిజాం సర్కారు హైదరాబాద్‌కు ఒకరూపును తీసుకొచ్చారన్నారు. తమ ప్రభుత్వం హయాంలో ఫోర్త్ సిటీ నిర్మిస్తామని స్పష్టం చేశారు.