New Ration Cards Issued from 2nd October : రాష్ట్రంలో నూతన రేషన్‌కార్డుల జారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికార యంత్రాగాన్ని సీఎం రేవంత్ ఆదేశించారు. రేషన్ కార్డులు జారీకి పటిష్ఠ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆయన సూచించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మరోవైపు రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల జారీకి మంత్రివర్గ ఉపసంఘం విధి విధానాలను రూపొందిస్తోంది. ఈ క్రమంలో ఆయా కుటుంబాల వార్షిక ఆదాయ పరిమితిని కూడా నిర్ణయించనుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో రెండు ఆదాయ పరిమితుల ప్రకారం రేషన్ కార్డులు జారీ చేసేవారు. ఇప్పుడు ఈ ఆదాయ పరిమితిని మార్చాలా, తగ్గించాలా, ఉన్నదాన్నే కొనసాగించాలా అన్నదానిపై కమిటీ కసరత్తు చేస్తోంది. దీనిపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ నేతృత్వంలో పలువురు అధికారులు గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధి విధానాలను అధ్యయనం చేశారు.
నివేదికలో పలు మార్పులు : పలు రాష్ట్రాల్లో అధ్యయనానికి వెళ్లిన బృందం ఒక నివేదికను ఉపసంఘానికి అందజేసింది. దానిపై చర్చ సాగింది. రాష్ట్రంలో రేషన్‌కార్డును ఒక్క పౌర సరఫరాల వస్తువులను తీసుకోవడానికే కాకుండా పలు సంక్షేమ పథకాల్లోనూ ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయ పరిమితి నిర్ధారణ విషయంలో కొత్త రేషన్ జారీపై పలు మార్పులను చేయాలని చూస్తోంది. పరిమితిని తగ్గిస్తే ఎంత వరకు తగ్గించాలి, ఇప్పుడున్నట్లు కొనసాగిస్తే అర్బన్ ఏరియాల్లోనే అదే పరిమితిని ఉంచాలా లేదా, లేక తగ్గించాలా, ఆదాయం వ్యత్యాసం ఉంటుంది కావున ఇలా అన్ని కోణాల్లో సంఘం తాజాగా చర్చించినట్లు తెలిపింది.