CM Revanth on State Formation Day : తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా ప్రణాళికలు, నూతన విధానాల రూపకల్పన మొదలైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. గడచిన పదేళ్లుగా రాష్ట్రంలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టడంతో పాటు ఇంతకాలం కోల్పోయిన ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరిస్తామని సీఎం అన్నారు.
ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం :రాష్ట్ర ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, ప్రజా పాలనను అందిస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఈ ఏడాది జూన్ 2 తేదీకి అత్యంత ప్రాధాన్యముందని రేపటితో తెలంగాణ స్వరాష్ట్రానికి సంపూర్ణ విముక్తి లభించిందని సీఎం పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇకపై తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుందని సీఎం గుర్తు చేశారు. ఇకపై విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సింహభాగం తెలంగాణ ప్రజలకే దక్కుతాయన్నారు.
CM Revanth on TS Decade Celebrations : తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులందరికీ ఆయన అభినందనలు తెలిపారు.