CM Revanth Meets Central Team Today: రాష్ట్రంలో వరదలతో జరిగిన నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. వరదలతో తీవ్రంగా నష్టపోయినట్లు కేంద్ర బృందానికి వివరించారు. తెలంగాణాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందంతో సచివాలయంలో ఇవాళ (సెప్టెంబరు 13వ తేదీ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ రఘురాం రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన వరద నష్టం గురించి కేంద్ర బృందానికి మంత్రులు వివరించారు. ఎక్కడెక్కడ నష్టం తీవ్రంగా జరిగిందో చెప్పారు. పంటలు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల గురించి వివరించడంతో పాటు ఆస్తినష్టం జరిగిన తీరును కూడా కేంద్ర బృందానికి సవివరంగా తెలిపారు. 10,320 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు.
Central Team On Floods in Telangana :వరదలతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణకు ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయం కింద నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని సీఎం రేవంత్ కోరారు. ఖమ్మం జిల్లా మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే అక్కడ వరద నివారణకు శాశ్వత పరిష్కారమని తెలిపారు. రాష్ట్రంలో భవిష్యత్తులో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకునేందుకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం కార్యాచరణ ప్రణాళిక ఉండాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు, వరద వల్ల రాష్ట్రంలో రూ.10,320 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. అత్యంత అధికంగా రోడ్లు, భవనాల శాఖకు రూ.7,693 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖకు రూ.1,216 కోట్లు నష్టం వచ్చినట్లు తెలిపింది.