CM Jagan Support to Thota Trimurthulu :నా ఎస్సీలు అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే సీఎం జగన్ నిజ స్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. మాటలతో మాయచేసి, చేతలతో గొంతు కోస్తారని నిరూపితమైంది. దళితులకు శిరోముండనం చేసినట్లు కోర్టు నిర్ధారించి, శిక్ష వేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు (Thota Trimurthulu)తో మండపేట అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయించారంటే జగన్‌కు దళితులంటే ఎంత చులకన? శిక్ష ఖరారయ్యాక కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా, దర్జాగా పోటీ చేయ్ అంటూ భరోసా కల్పించారు.
దళిత యువకుడి హత్య, డోర్ డెలివరీ చేసిన కేసులో నిందితుడైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీని ఏదో మొక్కుబడిగా సస్పెండ్ చేసినా, మళ్లీ తన వెనకే తిప్పుకుంటూ జగన్ అందలమెక్కించారు. అపాయింట్‌మెంట్ లేకుండానే నేరుగా తన తాడేపల్లి ప్యాలెస్‌లోకి వచ్చేంత స్వేచ్ఛ ఇచ్చారు. అతడిని ఎస్టీ నియోజకవర్గమైన రంపచోడవరానికి సామంతరాజుగా చేసి, అక్కడి అభ్యర్థిని గెలిపించే బాధ్యత కూడా కట్టబెట్టారంటే జగన్ ఎంతకు బరితెగించారు? దళితులంటే మరీ ఇంత లెక్కలేనితనమా? సీఎం అండ చూసుకొని తోట త్రిమూర్తులు మండపేట అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేయడం చూసి అంతా విస్తుపోతున్నారు.
శిక్ష ఖరారైనా తోట త్రిమూర్తులే అభ్యర్థి :అమానవీయంగా దళిత యువకులకు శిరోముండనం చేయించిన ఘటనలో తోట త్రిమూర్తులును విశాఖపట్నం కోర్టు దోషిగా తేల్చింది. 18 నెలల శిక్షతో పాటు జరిమానా విధిస్తూ ఈ నెల 16న తీర్పు చెప్పింది. అయినా సరే ఆయన్నే మండపేట అభ్యర్థిగా సీఎం జగన్ కొనసాగించారు. దళితుల మనోభావాలను దెబ్బతీయడాన్ని తన విజయంగా భావిస్తున్నారో మరేమోగానీ కనీస పశ్చాత్తాపం లేకుండా త్రిమూర్తులు మండపేటలో నామినేషన్ సమర్పించారు.
దళిత యువకుల శిరోముండనం కేసు - హైకోర్టులో విచారణ - Siromundanam case
విశాఖపట్నం కోర్టు శిక్ష విధించాక, ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 'ఇక్కడి నుంచి నేరుగా మండపేటలో ప్రచారానికి వెళ్తున్న' అని చెప్పడం గమనార్హం. ఆయన అనుచరులు సైతం జై తోట అంటూ నినాదాలు చేయడం చర్చనీయాంశం అయ్యింది. రాష్ట్రంలో దళిత జనాభా ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి అగ్రస్థానంలో ఉంటుంది. అలాంటి జిల్లాలోనే ఎమ్మెల్సీలు త్రిమూర్తులు, అనంతబాబు దళితులను వంచించారు.
త్రిమూర్తులు ఓ వివాదాస్పదం? : త్రిమూర్తులు వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదమే. పార్టీలు మారుతూ గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా లీజుకు తీసుకుని, అదే బస్టాండ్‌కు దారి లేకుండా చేసి భవనం నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. మండపేటలో ఓ వ్యక్తి షెడ్డు వేసుకుంటే దాన్ని కూల్చివేయించారు. అనంతరం కప్పం కట్టాక అనుమతులిచ్చారనేది బహిరంగ రహస్యం. అంతేగాక త్రిమూర్తులు మండపేట వైసీపీ బాధ్యుడిగా వెళ్లినప్పటి నుంచి అక్కడ ఎవరు ఇల్లు నిర్మించాలన్నా తనకు కప్పం కట్టేలా బెదిరించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.