CM Jagan Negligence on Recruitment :2020 అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలు, 2023 అక్టోబరు 21 మళ్లీ పోలీసు అమరవీరుల సంస్మరణ సందర్భంగా జగన్ చేసిన ప్రకటన పోలీసు ఉద్యోగాల భర్తీపై జగన్ నయవంచనకు నిలువెత్తు సాక్ష్యాలు. కానిస్టేబుల్ పోస్టుల నియామకాలకు సంబంధించి కోర్టు కేసు అడ్డంకిగా ఉందంటూ సీఎం హోదాలో జగన్ మొదలు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి (DGP Rajendranath Reddy) వరకూ అబద్ధాన్ని అలవోకగా వల్లెవేస్తున్నారు. ఏటా 6వేల 500 చొప్పున పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ ప్రగల్భాలు పలికి చివరకు నట్టేట ముంచుతున్నారు. అసలు కానిస్టేబుల్ ఉద్యోగ నియామక ప్రక్రియ నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చిన దాఖలాలే లేవు. కేసే అడ్డంకి అయితే కోర్టులో సమర్థ వాదనలు వినిపించి న్యాయపరమైన చిక్కులు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది.
ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపే ప్రతిపక్ష నాయకులు, వ్యక్తులు, సంస్థలపై అక్రమ కేసులు బనాయిస్తూ వాటిపై వాదనలు వినిపించేందుకు కోట్లలో ఫీజులు చెల్లించి న్యాయవాదులను తీసుకొస్తోంది వైఎస్సార్సీపీ సర్కారు. వేలాది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న ఉద్యోగాల నియామకాలకు సంబంధించి వాదనలను గట్టిగా వినిపించే సామర్థ్యం జగన్ ప్రభుత్వానికి లేదా అన్న నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు నిలదీస్తున్నారు.
Police Physical Fitness Test: ప్రాథమిక పరీక్ష పూర్తై రెండు నెలలు.. దేహదారుఢ్య పరీక్షలు ఇంకెప్పుడు?
AP Police Constable Recruitment 2023 :పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియలో అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం 2022 నవంబరు 28న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటి ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు గతేడాది ఫిబ్రవరి 5న విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4,59,812 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా వారిలో 95,209 మంది అర్హత సాధించారు. వీరందరికీ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. గతేడాది మార్చి 13 నుంచి 20వ తేదీ వరకు వీటిని నిర్వహిస్తామంటూ షెడ్యూల్ విడుదల చేసి హాల్‌టికెట్లు కూడా జారీ చేశారు. తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వీటిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ఎన్నికలు పూర్తయి దాదాపు 11 నెలలు గడిచింది. అయినా ఇప్పటివరకూ ఆ పరీక్షల నిర్వహణ గురించి పట్టించుకున్న పాపానపోవడం లేదు జగన్ సర్కారు.
ఎన్నికల కోడ్ వస్తే అంతే సంగతి : కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ జారీకి రెండేళ్ల ముందు నుంచే అభ్యర్థులు ఈ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పదవీ కాలం ముగియడానికి గడువు సమీపిస్తున్నా నియామక ప్రక్రియ ముగియకపోవడంతో ఇప్పట్లో భర్తీ చేస్తారా? లేదా? అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక పరిస్థితులు సహకరించకున్నప్పటికీ శిక్షణ, గదుల అద్దె కోసం వేలాది రూపాయల అప్పులు చేసి మరీ కాలం వెళ్లదీస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ వస్తే తమ పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలు విడుదల
తీవ్ర విమర్శలు :పోలీసుల ఉద్యోగాల భర్తీలో జగన్‌వి ఆది నుంచి జగన్ మడతపేచీలే. 2021 జూన్ 18న జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం 450 పోలీసు ఉద్యోగాల భర్తీకి అదే ఏడాది సెప్టెంబరులో నోటిఫికేషన్ జారీ చేస్తామని అందులో పొందుపరిచారు. పోలీసు శాఖలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా కేవలం 450 ఉద్యోగాల భర్తీకే నోటిఫికేషన్ ఇస్తామనడం పట్ల అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. క్యాలెండర్ పేర్కొన్న గడువు ముగిసినా ఆ ఉద్యోగ ప్రకటన విడుదల చేయలేదు. అధికారం చేపట్టిన మూడున్నరేళ్ల తర్వాత 2022 నవంబరులో 6,100 కానిస్టేబుల్ పోస్టులకు విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా కూడా భర్తీ ప్రక్రియ పూర్తవలేదు. నాలుగేళ్లలో ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని 2020 అక్టోబరులో జగన్ చెప్పారు. ఆ లెక్కన చూసినా ఇప్పటివరకు 19,500 పోలీసు ఉద్యోగాలు భర్తీ కావాలి. కానీ 411 ఎస్సై ఉద్యోగాలు మినహా మిగిలిన పోస్టులను భర్తీ చేయలేదు.
7 నెలల్లోనే పూర్తయిన భర్తీ ప్రక్రియ : టీడీపీ ప్రభుత్వ హయాంలో 200కు పైగా ఎస్సై, 2,200 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2018 నవంబరు, డిసెంబరు నెలల్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వాటికి సంబంధించిన ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు, తుది ఫలితాల ప్రక్రియ మూడు నెలల వ్యవధిలోనే పూర్తయింది. అప్పట్లో ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో తుది ఫలితాల వెల్లడి నిలిచిపోయింది. అంతకు ముందే సిద్ధంగా ఉన్న తుది ఫలితాలను 2019 మేలో అధికారం చేపట్టిన జగన్ ప్రభుత్వం జూన్‌లో విడుదల చేసింది. అలా చూసినా భర్తీ ప్రక్రియ మొత్తం 7 నెలల్లోనే పూర్తయిపోయింది. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం మాత్రం 2022 నవంబరు 28న విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన ఖాళీల భర్తీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకుండా కాడి వదిలేసింది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది.
కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితి రెండేళ్లు పెంపు