CM Jagan Negligence on Drinking Water Schemes :వేసవికి ముందే రాష్ట్రంలోని పట్ణణప్రాంతాల్లో నీటిఎద్దడి తలెత్తే సూచనలు కన్పిస్తున్నాయి. ఒంగోలులో జనవరిలోనే నాలుగు రోజులకోసారి తాగు నీరు సరఫరా చేసిన పరిస్థితి. నగర శివారు ప్రాంతాలకు వారానికోసారి ఇవ్వడమే గగనమవుతోంది. గుండ్లకమ్మ నీటిని నగరానికి రప్పించడం ద్వారా శివారు ప్రాంతాల తాగునీటి అవసరాలు తీర్చొచ్చన్న ఉద్దేశంతో టీడీపీ హయాంలో అమృత్ పథకం కింద 123 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు. గుండ్లకమ్మ నుంచి నగరంలో నీరు నిల్వచేసే చెరువుల వరకూ. పైపులు వేయాలి, 4ఓవర్ హెడ్ ట్యాంకులు, రెండు ఫిల్టర్ ప్లాంట్లు నిర్మించాలి. కానీ జగన్ ప్రభుత్వం నిధులివ్వకుండా పనుల్ని అటకెక్కించింది.
Drinking Water Schemes in AP :విజయవాడలోని జక్కంపూడి, రాజీవ్‌నగర్, పాయకాపురం, గంగిరెద్దులదిబ్బ, కండ్రిక, శాంతినగర్ తదితర ప్రాంతాల్లోనూ కుళాయిల ద్వారా నీటి సరఫరా అంతంతమాత్రంగానే ఉంది. ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేస్తామన్న హామీ కూడా పూర్తిగా అమలు నోచుకోలేదు. కృష్ణా నది నుంచి వచ్చే నీళ్లలో ఆల్గే శాతం ఎక్కువగా ఉంటున్నందున శుద్ధి చేయడంలో జాప్యమై శివారు ప్రాంతాలకు సరఫరాలో జాప్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. నీటి శుద్ధి వ్యవస్థను మెరుగుపరిచేందుకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. నదిలో ప్రవాహం తగ్గుతున్నందున రాబోయే రోజుల్లో మిగతా ప్రాంతాలకూ తాగునీటి సమస్య తప్పకపోవచ్చనే ఆందోళన నెలకొంది. తిరువూరులోనూ తాగునీరు రెండు, మూడు రోజులకోసారి సరఫరా చేయడమే గగనమవుతోంది.
'గొంతెండుతోంది మహాప్రభో' - వేసవికి ముందే తాగునీటి సమస్య జఠిలం
కలుషిత నీరు :అనంతపురం జిల్లా గుత్తిలోనూ కుళాయిల ద్వారా నెలకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గుత్తి పట్టణ ప్రజల దాహార్తి తీరాలంటే 40 లక్షల లీటర్ల నీరు కావాలి. కానీ 8 లక్షల లీటర్ల నీళ్లు సరఫరా చేయడమే గగనమవుతోంది. ట్యాంకర్ల ద్వారా అరకొరగా సరఫరా చేస్తున్నా కలుషిత నీరు అందుతోందని ఆరోపణలున్నాయి. గుత్తిలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి AIIBసాయంతో గత టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన పనులు అసంపూర్తిగా ఉన్నాయి. జగన్ సర్కార్ నిధులివ్వకుం వల్ల పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణం ఎక్కడివక్కడే ఆగిపోయాయి.
అమలు కానీ ప్రణాళికలు : విశాఖలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి జగన్ ప్రభుత్వ ప్రణాళికలు కాగితాలు గదాటితే ఒట్టు. నగరానికి తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలకోసం తూర్పుగోదావరి జిల్లా ఏలేరు ప్రాజెక్టు నుంచి రోజూ 250 మిలియన్ గ్యాలన్ల నీటిని ఓపెన్ కెనాల్ ద్వారా తీసుకొస్తుంటారు. అందులో 25శాతం అంటే 62 మిలియన్ గ్యాలన్లకుపైగా ఆవిరవుతోంది. ఓపెన్ కెనాల్ స్థానంలో పైపులైను ఏర్పాటు చేయాలన్న ప్రణాళికలు అమలుకు నోచుకోలేదు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా 5 టీఎమ్సీల నీరు నిల్వ చేసేలా విశాఖ పరిధిలో 5 జలాశయాలు నిర్మించాలన్న ప్రతిపాదనలూ నివేదికలకే పరిమితమయ్యాయి.