CM Jagan Neglected Irrigation Projects in AP : జగన్ సీఎం ఉన్న అయిదేళ్ల పరిపాలనలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల విధ్వంస పర్వమే కొనసాగింది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాక ఉన్నవాటి నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడంతో ఏకంగా ఆనకట్టలే కొట్టుకుపోయాయి. జగన్ నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలిచి, కృత్రిమ విపత్తుల్లో రికార్డు సృష్టించారు. రాష్ట్రంలో విపత్తులు సంభవిస్తే నాయకుడిగా ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించి, వారికి అండగా నిలవాలి. ప్రాణ, ధన నష్టం అతి తక్కువగా వాటిల్లేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు విరుద్ధంగా ఈ అయిదేళ్ల పాలనలో జగన్ అనే విపత్తుగా మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది. ఇందుకు ప్రజల కళ్లముందే సంభవించిన దుర్ఘటనలు సాక్ష్యాలుగా నిలిచాయి.
ముందు చూపు ఎక్కడ ? :వాతావరణ శాఖ, కేంద్ర జల సంఘం, కేంద్ర ప్రభుత్వం అందించే సమాచారం ఆధారంగా స్పందించి విపత్తు నిర్వహణపై సీఎం జగన్ ఏనాడూ దృష్టి పెట్టిన పాపాన పోలేదు. సాగునీటి రంగంలో ఎక్కడ ఏ అధికారిని నియమించుకోవాలి. ఏ ప్రాజెక్టు నిర్వహణలో ఎవరికి అనుభవముందన్న పరిశీలన ఎప్పుడు జరగలేదు. వరద సమయంలో డ్యాంల నిర్వహణ తెలియని, ఏ కాలువలోకి ఎంత పరిమాణంలో నీటిని వదలాలో కనీస అవగాహన లేని “తన” వాళ్లకు ఇష్టారాజ్యంగా పదవులు కట్టబెట్టారు. రాష్ట్ర ప్రజలకు చేతులారా కష్టాలు కొనితెచ్చిన పాలకుడిని ఏమనాలి? అలాంటి వారి పాలనలో ఏం జరుగుతుంది? అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట కొట్టుకుపోయి 39 మంది ప్రాణాలు కోల్పోయారు. డ్యాం దిగువనున్న గ్రామంలో కొందరు అనుభవజ్ఞులు వందల మందిని అప్రమత్తం చేశారు. కొండలు, గుట్టలు ఎక్కించి వారి ప్రాణాలను రక్షించారు. విపత్తును ఊహించినా జగన్ నాయకత్వంలో పనిచేస్తున్న అధికారులు మాత్రం చోద్యం చూశారు.
ఉత్తరాంధ్రపై మాటల్లోనే జగన్ ప్రేమ - అభివృద్ధిలో ఉత్త చేయే
జగన్ సృష్టించిన కృత్రిమ విపత్తులు :
- 2020లో కృష్ణా నదికి వచ్చిన వరదను సరిగ్గా నిర్వహించని ఫలితంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 51 గ్రామాలు మునిగిపోయాయి. వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. తెలంగాణలో క్లౌడ్ బరస్ట్ ( అతి భారీ వర్షాలు) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చారించిన లెక్క చేయలేదు. అక్కడ భారీ వర్షాలు కురిస్తే నీరంతా నది నుంచి దిగువకే వస్తుందని తెలిసినా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు.
- 2020 ఆగస్టు, 2021 సెప్టెంబరు నెలల్లో శ్రీశైలం జలాశయం నిర్వహణ తీరు పైనా కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ రెండేళ్లలోనూ క్రస్ట్ గేట్లపై నుంచి నీరు పొంగి పొర్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
- 2020లో వచ్చిన భారీ వరదలకు పోలవరంలో కీలకమైన డయాఫ్రం వాల్ ధ్వంసమైన విషయం అందరికి తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎగువ కాఫర్ డ్యాంలోని గ్యాప్‌లను సకాలంలో పూడ్చకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. దీంతో డయాఫ్రం వాల్‌ను మళ్లీ రూ. వందల కోట్లుతో కొత్తగా నిర్మించాల్సి వచ్చింది.
- 2021 ఆగఘ్టలో పులిచింతల ప్రాజెక్ట్‌లోని 16వ నంబరు గేటు కొట్టుకుపోయింది. టైప్లాట్లు పూర్తిగా తెగిపోయాయి. అప్పటికి రెండేళ్లుగా గేట్ల నిర్వహణను పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది అనుభవజ్ఞులు సృష్టం చేశారు.
- 2021లో కురిసిన భారీ వర్షాలకు పింఛా ప్రాజెక్టు మట్టికట్ట కూడా కొట్టుకుపోయింది.
- 2021లో అన్నమయ్య జలాశయం మట్టి డ్యాం కొట్టుకుపోయింది. దీంతో 39 మంది మరణించారు. ఇళ్లు మునిగి, వందల కుటుంబాలు వీధిన పడ్డారు. ప్రాజెక్టు గేట్లు సరిగా పనిచేయడం లేదని తెలిసినా వాటిని బాగు చేయడానికి వైసీపీ సర్కారు నిధులను మంజూరు చేయలేదు. భారీ వరదపై సమాచారం ఉన్న గేట్లు ఎత్తడంలో నిర్లక్ష్యం చేశారు.
- 2022 ఆగస్టు 31 రాత్రి గుండ్లకమ్మలో 3వ నంబరు గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతుల కోసం రూ.3 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదించారు. నిధుల మంజూరుకు జగన్ సర్కారు స్పందించక పోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైంది.
- 2023 డిసెంబరు 8న రాత్రి గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేటు మరోసారి కొట్టుకుపోయింది. అంతకు ముందు కొట్టుకుపోయిన 3వ నంబరు గేటును కూడా జగన్ సర్కారు మళ్లీ బిగించకలేకపోయింది.
- 'పోలవరం'లో నిర్మించిన గైడ్‌బండ్ 2023 ఆగస్టులో కుంగిపోయింది. వైసీపీ సర్కారు వచ్చాక చేపట్టిన ఈ నిర్మాణంలో నాణ్యత లేకపోవడం, డిజైన్లకు అనుగుణంగా పనులు చేపట్టకపోవడం, తగిన సమయంలో కట్టడాన్ని పూర్తి చేయకపోవడమే కారణమని నిపుణులు తేల్చి చెప్పారు.