తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో జాబ్​ క్యాలెండర్​ను మడతెట్టేసిన 'జగన్​ మామ' - నిరుద్యోగులకు చుక్కలే - Andhra job calendar Cheating

CM Jagan Cheating Unemployed Youth: అంతన్నారు. ఇంతన్నారు. అధికారమిస్తే కొలువుల జాతరేనన్నారు. తీరా అబద్ధాలతో సీఎం కొలువు దక్కించుకుని ఆ తర్వాత యువత ఆశల్ని చిదిమేశారు. నియామకాల హామీలను బంగాళాఖాతంలో కలిపేసి జాబ్‌ క్యాలెండర్‌ జాడ లేకుండా చేశారు. మెగా డీఎస్సీ పేరుతో ఇన్నాళ్లూ మురిపించి కొన్ని పోస్టులకే పరిమితం చేసి దగా చేశారు.

CM Jagan
CM Jagan Cheating Unemployed Youth

By ETV Bharat Telangana Team

Published : Feb 20, 2024, 9:33 AM IST

ఏపీలో జాబ్​ క్యాలెండర్​ను మడతెట్టేసిన 'జగన్​ మామ' - నిరుద్యోగులకు చుక్కలే

CM Jagan Cheating Unemployed Youth : ప్రతిపక్ష నేతగా మన కొలువుల భర్తీపై జగన్‌ (Jagan) కొండంత రాగం తీశారు. గద్దెనెక్కాక తుస్సుమనిపించారు. నాలుగున్నరేళ్లు ఊసేఎత్తకుండా ఎన్నికల వేళ మొక్కుబడిగా 6,100 పోస్టులతో మాయ ప్రకటనను తెరపైకి తెచ్చారు. ఇదే మెగా డీఎస్సీ (Mega DSC)పై జగనన్న దగా ఇదీ!

Unemployed Youth in Andhra Pradesh :రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2లక్షల 30వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రతిపక్షనేతగా జగన్‌ ప్రతిచోట ఊదరగొట్టారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలతో సంబంధం లేకుండానే గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ నియామకాలను కూడా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలతో ముడిపెడుతూ నిరుద్యోగులను మోసపుచ్చారు.

మెగా డీఎస్సీ అంటూ నాడు ఆర్భాటంగా చెప్పి 6,100 పోస్టులకే ఇటీవల ప్రకటన ఇచ్చి దగా చేశారు. ఇందులోనూ పరీక్షకు సన్నద్ధమయ్యే సమయమూ ఇవ్వకుండా అభ్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రకటనకు దిక్కూమొక్కూలేదు. 4,100 ఎస్సై ఉద్యోగాల భర్తీ మినహా ఆ శాఖలోని ఖాళీలు పట్టించుకున్న పాపాన పోలేదు. కడప ఉక్కు కర్మాగారాన్ని మూడేళ్లలో పూర్తి చేసి, 10 వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వంచించారు.

పబ్లిక్‌ సర్వీస్‌ అధికారులు వాదన : జగన్‌ సర్కారు ఐదేళ్లలో ఒకే ఒక్కసారి 2021 జూన్‌ 18న జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చింది. ఏపీపీఎస్సీ (APPSC) నుంచి ఇప్పటివరకు 2,210 పోస్టుల భర్తీకి 33 నోటిఫికేషన్లు ఇచ్చారు. అందులోనూ దాదాపు సగం గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పోస్టులే. ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరాలు రానిదే పూర్తిస్థాయి నోటిఫికేషన్లు ఎలా ఇస్తామని పబ్లిక్‌ సర్వీస్‌ అధికారులు వాదిస్తున్నారు.

పాఠశాల విద్యాశాఖలో 2,20,266 పోస్టులకు లక్షా 73వేల 713 మంది శాశ్వత ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ లెక్కన 46,553 ఖాళీలు ఉన్నాయి. ఉన్నత విద్యాశాఖలో 15,818 పోస్టులకు 5,193 మందే ఉన్నారు. ఆ శాఖలో ఖాళీల సంఖ్య 10,625. వ్యవసాయ, సహకార శాఖలో 4,423, సాంఘిక సంక్షేమ శాఖలో 6,438 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

మాట తప్పారు - మడమ తిప్పారు : ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే, ఆ ఖాళీలను భర్తీచేస్తే వేతనాల కోసం రుణం తీసుకోవాల్సి వస్తుందేమోనన్న ఉద్దేశంతో నియామకాలనే తగ్గించేసిన ఘనత జగన్‌ సర్కార్‌ది. కేవలం 6,100 పోస్టులతోనే ఉపాధ్యాయ ఉద్యోగ ప్రకటన జారీ చేసి అవే మొత్తం ఖాళీలు అంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది.

అంతకు ముందు రాష్ట్రంలో 8,366 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని సాక్షాత్తూ విద్యాశాఖ మంత్రే శాసనమండలిలో ప్రకటించారు. జిల్లా, మండల పరిషత్తు, పురపాలక శాఖల పరిధిలోని ప్రభుత్వ బడుల్లో ఈ ఖాళీలు ఉన్నట్లు వివరించారు. అంతలోనే యథా ముఖ్యమంత్రి తథా మంత్రి అన్నట్లుగా మాట తప్పారు. మడమ తిప్పారు.

వామ్మో పది లక్షల కోట్లా! - ఏపీలోకి అడుగు పెట్టాలంటేనే భయపడేలా రాష్ట్ర అప్పులు

ప్రభుత్వంపై విమర్శలు :ఉద్యోగాల భర్తీ విషయంలో కేసులపై నెపం మోపి జగన్‌ సర్కార్‌ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో కలిపి 3,220 పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చారు. పోస్టుల హేతుబద్ధీకరణ, రిజర్వేషన్‌ రోస్టర్‌పై పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై గత డిసెంబరులోనే రిప్లై కౌంటర్‌ వేయాల్సిన ప్రభుత్వం మౌనంగా ఉండిపోయినట్లు విమర్శలున్నాయి. 6,100 కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి 2022లో ఇచ్చిన ప్రకటనకు కోర్టు కేసు అడ్డంకిగా ఉందంటూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్‌ తప్పుదోవ పట్టిస్తున్నారు.

నిరుద్యోగుల ఆవేదన : ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత జాప్యం పట్టభద్రులకు శాపంలా మారింది. ఐదేళ్లలో సకాలంలో, సరైన సంఖ్యలో నియామకాలు చేపట్టక వేలాది మంది నిరుద్యోగులు ఇప్పటికే అర్హత కోల్పోయి నష్టపోయారు. పట్టా పొంది కూడా ప్రయోజనం లేకుండా పోయిందన్న వారి ఆవేదన జగన్‌ సర్కార్‌కు పట్టడం లేదు. సర్కారు కొలువులను ఇవ్వని జగన్‌ కనీసం 'కాంట్రాక్టు' ఉద్యోగాలైనా దక్కుతాయేమోనన్న ఆశలను కూడా చిదిమేశారు. ఆర్టీసీలోని ప్రతి కాంట్రాక్టును నిరుద్యోగ యువతకే ఇస్తామని, ఆర్టీసీ, ప్రభుత్వ శాఖలు అద్దెకు తీసుకునే బస్సులు, కార్ల కాంట్రాక్టును కూడా వారికే ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఒక్క కాంట్రాక్టును కూడా ఇవ్వలేకపోయారు.

'మెగా' డీఎస్సీ హామీ గుర్తుందా జగన్‌?

టీఎస్​పీఎస్సీ కీలక నిర్ణయం - గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ రద్దు చేసినట్లు ప్రకటన

ABOUT THE AUTHOR

...view details