CM Jagan Assurances to Srikakualm District :మాట తప్పను, మడమ తిప్పను అని పదేపదే ఊదరగొట్టే ముఖ్యమంత్రి జగన్ శ్రీకాకుళం జిల్లాకు లెక్కకు మిక్కిలి హామీలైతే ఇచ్చారు కానీ ఒక్కదాన్నీ అమలు చేయలేదు. ఐదేళ్లుగా జిల్లాలో ప్రాజెక్టులు పడకేసినా పైసా విదల్చకుండా నిర్లక్ష్యం చేశారు. అభివృద్ధిని అటకెక్కించారు. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా, అదీ ఇదీ అనే భేదం లేకుండా, అన్ని నియోజకవర్గాలకు, అన్ని వర్గాల ప్రజలకు మొండిచేయి చూపిన జగన్ నేడు సిక్కోలుకు ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
రూ.10 కోట్లన్నారు, రూపాయి ఇవ్వలేదు :శ్రీకాకుళం వచ్చిన ప్రతి సందర్భంలోనూ జిల్లాపై హామీల వర్షం కురిపించిన జగన్ మాటలకే పరిమితమయ్యారు. జిల్లాకు మణిహారంగా నిలిచే కోడి రామ్మూర్తి క్రీడా ప్రాంగణం పూర్తికి రూ. 10 కోట్లు మంజూరు చేస్తామన్న జగన్ హామీ నీటిమూటగానే మిలిగిపోయింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొంత మేర పనులు జరిగినా వైసీపీ పాలనలో అడుగు ముందుకు పడలేదు. రన్నింగ్ ట్రాక్ కోసం ప్రతిసారీ మట్టివేస్తున్నారు తప్పితే ఎలాంటి పనులు చేయలేదు. జిల్లాలో ఆడుదాం ఆంధ్ర క్రీడలు సైతం కనీస సౌకర్యాలు లేని ప్రదేశాల్లో జరిగాయి. ఒలంపిక్ పతక విజేతను కన్న జిల్లాకు కనీసం క్రీడా ప్రాంగణం లేకుండా పోయింది. దీని నిర్మాణానికి అవసరమైన నిధులకు బటన్ నొక్కే మనసు జగనన్నకు ఎందుకు రాలేదని క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు.
"మంత్రి ధర్మాన ప్రసాద్ కోరిక మేరకు స్టేడియం నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని ఉత్తుత్తి హామీలు ఇచ్చారు. అనంతరం స్టేడియం నిర్మాణం కోసం ఎలాంటి పనులను చేపట్టలేదు. ఎన్నికలు సమీస్తున్న వేళ టెండర్లు పిలిచి స్టేడియం నిర్మాణ పనులు చేపట్టినట్లు కొత్త డ్రామాలకు తెరలేపారు" -సిక్కోలు క్రీడాకారుడు
రహదారిని గాలికొదిలేశారు :శ్రీకాకుళం, ఆమదాలవలస ప్రధాన రహదారి పనులు నిలిచి ఏళ్లు గడిచాయి. దారంతా గుంతలతో ప్రమాదకరంగా తయారైంది. అయిదేళ్లలో 24 మంది మృత్యువాత పడ్డారు. 81 మంది క్షతగాత్రులయ్యారు. ఒప్పందం ప్రకారం రహదారిని 2021 డిసెంబర్ నాటికే పూర్తిచేయాల్సి ఉన్నా రూ.14 కోట్లును గుత్తేదారులకు బకాయిలు విడుదల చేయకపోవడంతో పనులు నిలిపేశారు. రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. సభాపతి తమ్మినేని సీతారాం, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉన్నా కనీసం రహదారి వేయించలేకపోయారని స్థానికులు విమర్శిస్తున్నారు.
గంగపుత్రులకు పంగనామాలు :సీఎం హోదాలో తొలిసారి శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన జగన్ హార్బర్, జెట్టి నిర్మాణానికి హామీ ఇచ్చారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మంత్రి సీదిరి అప్పలరాజు తన సొంత నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మంచినీళ్లపేట హార్బర్‌కు జెట్టి నిర్మాణానికి శంకుస్థాపన చేసినా పనులు మాత్రం సాగలేదు. నామమాత్రంగా ప్రహరీ గోడ కట్టి ఆపై గాలికొదిలేశారు. గతేడాది ఏప్రిల్‌లో మూలపేట పోర్టు పనుల శంకుస్థాపన చేసిన జగన్ అప్పటి నుంచి వాటిని పట్టించుకోలేదు. బుడగట్లపాలెం హార్బర్ నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన జగన్ ఐదేళ్ల పాటు గాలికొదిలేసి ఎన్నికల ముందు పనులు ప్రారంభించారు.
సాగునీటికి సెలవిచ్చేశారు :వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం కింద అదనపు పరిహారం అందజేస్తామని చెప్పిన జగన్ భూసేకరణ చట్టం పరిహారం కాకుండా ఎకరాకు లక్ష మాత్రమే ఇచ్చారు. అందులోనూ సాంకేతిక కారణాలతో రూ.కోటి 15 లక్షలు నిలిచిపోయాయి. యూత్ ప్యాకేజీ కింద రూ. కోటి 31 లక్షలు నిలిచాయి. ఇవికాకుండా భూ పరిహారం రూ.12.16 కోట్లు. యూత్ ప్యాకేజీ రూ.11.98 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. తిత్లీ తుఫానులో బాధితులకు రెట్టింపు పరిహారం హామీ పరిహాసంగా మారింది. జిల్లాలోని 12 మండలాల్లో 6 వేల 6 వందల 14 మంది లబ్ధిదారులకు ఇంతవరకు చెల్లింపులు చేయలేదు. సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ రాజకీయకక్ష సాధింపులకు పాల్పడుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.