CM Chandrababu Davos Tour 2025 :ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి దిల్లీ మీదుగా దావోస్ పర్యటనకు బయల్దేరారు. సీఎం రాత్రి 11 గంటలకు దిల్లీ చేరుకుంటారు. అక్కడి నుంచి అర్ధరాత్రి 1.45 గంటలకు జ్యూరిచ్ వెళ్లనున్నారు. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా ఆయన దావోస్ పర్యటన జరగనుంది. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్‌తో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధనకు ఐదు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. సీఎం వెంట ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌తో పాటు అధికారులు ఉన్నారు.
సోమవారం నాడు జ్యూరిచ్‌లో ఉన్న భారత రాయబారితో సీఎం చంద్రబాబు బృందం భేటీ కానుంది. హిల్టన్ హోటల్లో 10 మంది పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు. హోటల్ హయత్‌లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో నిర్వహించనున్న భేటీలో తెలుగు పారిశ్రామిక వేత్తలతో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించనున్నారు. ఏపీని ప్రమోట్ చేయడం, పెట్టుబడులకు వారిని ఆహ్వానించడంపై సమావేశంలో చర్చించనున్నారు.
అక్కడ నుంచి 4 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి దావోస్ చేరుకోనున్న సీఎం బృందం తొలి రోజు రాత్రి పలువురు పారిశ్రామిక వేత్తలతో డిన్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే అర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్‌తో సమావేశం కానున్నారు. రెండో రోజు సీఐఐ సెషన్లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చిస్తారు. అదేవిధంగా సోలార్ ఇంపల్స్, కోకకోలా, వెల్స్పన్, ఎల్జీ, కార్ల్స్‌బర్గ్, సిస్కో, వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి సంస్థల సీఈవోలతో, చైర్మన్లతో చంద్రబాబు భేటీ అవుతారు.