CM Chandrababu Visit Dandi Kutir :జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రతో ఏర్పాటు చేసిన దండి కుటీర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ - 2024లో పాల్గొనేందుకు గుజరాత్‌లోని గాంధీనగర్‌కు వెళ్లిన సీఎంను దండి కుటీర్‌ను సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
మహాత్మా గాంధీ జీవిత విశేషాలను అత్యాధునిక టెక్నాలజీతో, అరుదైన చిత్రాలతో ఏర్పాటు చేశారు. దండి కుటీర్ గురించి ప్రధాని మోదీ ద్వారా తెలుసుకున్న సీఎం చంద్రబాబు రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అనంతరం సందర్శించి కాసేపు అక్కడ గడిపారు. గాంధీజీని స్మరించుకుని నివాళులు అర్పించారు. దండి కుటీర్ సందర్శన తన జీవితంలో మరపురాని ఘటనగా గుర్తిండి పోతుందని అన్నారు. గాంధీజీ జీవిత చరిత్రను భవిష్యత్తు తరాలు తెలుసుకునేలా దండి కుటీర్ ఉందని అభిప్రాయపడ్డారు. గాంధీజీ తన జీవితం ద్వారా ప్రపంచానికి ఇచ్చిన సందేశాన్ని వివిధ చిత్రాలు, దృశ్యశ్రవణ విధానంలో ప్రదర్శించిన తీరును మెచ్చుకున్నారు.
దండి కుటీర్‌ను సందర్శించడం అద్భుతమైన అనుభవమని చంద్రబాబు తెలిపారు. దీన్ని చాలా వినూత్నంగా, విజ్ఞానదాయకంగా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దారని కొనియాడారు. మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల గురించి భవిష్యత్ తరాలకు తెలియజెప్పే అద్భుతమైన ప్రాంతంమని, ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ఏర్పాటైన దండి కుటీర్‌ను సందర్శించడం తన అదృష్టమని అన్నారు. భావితరాలు స్ఫూర్తిదాయకమైన, విలువలతో కూడిన జీవితాన్ని గడిపేలా మార్గదర్శనం చేసేలా దండి కుటీర్‌ను నిర్మించిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాలను సీఎం చంద్రబాబు రాశారు.