Chandrababu Speech in Assembly : స్వార్థ ప్రయోజనాల కోసం తాము కలిసి పోటీ చేయలేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే లక్ష్యంతో కలిసి పోటీ చేసినట్లు చెప్పారు. వైఎసార్సీపీ పాలనలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ నిర్వీర్యమైందని ఆరోపించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ లేకుంటే ఏపీని పునర్నిర్మాణం చేయలేమని భావించామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేశారు. వెంటిలేటర్‌పై ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పుడిప్పుడే బయటకు తెస్తున్నామని వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన సభ కౌరవసభని చంద్రబాబు విమర్శించారు. కౌరవసభను గౌరవసభ చేశాకే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశామని గుర్తుచేశారు. గౌరవసభను అవమానించే పార్టీ ఇవాళ అసెంబ్లీలో లేకుండా పోయిందని చెప్పారు. శాసనసభలో నిన్న (సోమవారం) చీకటి రోజు అని తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. సోమవారం నాడు వైఎస్సార్సీపీ నేతలు కేవలం 11 నిమిషాలే అసెంబ్లీలో ఉన్నారని వివరించారు. సంప్రదాయాలు మరచి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సమంజసమా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది తాము కాదని ప్రజలని చంద్రబాబు వెల్లడించారు.
"ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తాం. రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2,000లు ఆ తర్వాత రూ.4,000లు చేశాం. దివ్యాంగుల పింఛన్‌ను రూ.6,000లకు పెంచాం. మంచానికే పరిమితమైన వారికి రూ.15,000లు ఇస్తున్నాం. పింఛన్ల రూపంలో ఏటా రూ.34,000ల కోట్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ. పేదలకు అన్నం పెడుతున్నటువంటి అన్న క్యాంటీన్లను గత సర్కార్ మూసేసింది. మా ప్రభుత్వం రాగానే 203 అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించాం." - చంద్రబాబు, ముఖ్యమంత్రి
'మే నెలలో తల్లికి వందనం పథకం అమలు చేస్తాం. ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తాం. త్వరలో రైతు భరోసా అమలు చేయనున్నాం. రైతు భరోసా కింద కేంద్రం, రాష్ట్రం కలిసి రూ.20,000లు ఇస్తాం. మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు రూ.20,000లు అందిస్తాం. అభివృద్ధి చేస్తే ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయాన్ని ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తాం. వచ్చే ఏడాది 16,384 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం' అని చంద్రబాబు తెలిపారు.
AP Assembly Budget Session 2025 :గత ప్రభుత్వం కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర పథకాలకు ఇచ్చిన గ్రాంట్‌ను కూడా వైఎస్సార్సీపీ వాడేసిందని ఆరోపించారు. జల్‌జీవన్ కోసం రూ.80,000ల కోట్లు కావాల్సి ఉంటే అప్పటి సర్కార్ కేవలం రూ.20,000ల కోట్లు అడిగిందని విమర్శించారు. అందరూ గర్వపడేలా రాజధాని నిర్మిస్తామని స్పష్టం చేశారు. పేదరికం లేని సమాజాన్ని తయారు చేయడమే తమ లక్ష్యమని చంద్రబాబు వెల్లడించారు.