ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలో జనాభా పెంచేందుకు కృషి - జపాన్, చైనా, ఆస్ట్రేలియా విధానాల పరిశీలన - CM CHANDRABABU REVIEW

జనాభా వృద్ధి రేటుపై సీఎం చంద్రబాబు సమీక్ష- సంతానోత్పత్తి రేటు పడిపోవడంతో ఆందోళన

CM Chandrababu Review on Population Growth Rate
CM Chandrababu Review on Population Growth Rate (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2024, 7:10 AM IST

CM Chandrababu Review on Population Growth Rate :రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు అత్యల్పంగా ఉండటం, రోజు రోజుకీ వృద్ధుల సంఖ్య పెరుగుతూ, యువత సంఖ్య తగ్గిపోవడం, ఆధారపడి జీవించేవారు ఎక్కువగా ఉండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేశారు. జనాభా వృద్ధి రేటు దేశంలో 9 శాతం ఉంటే, రాష్ట్రంలో 3.5 శాతం మాత్రమే ఉందన్నారు. ప్రతి కుటుంబం ప్రొఫైల్‌కు తగ్గట్టుగా ప్రభుత్వ పథకాలు అందేలా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. పేదరిక నిర్మూలనకు సంపన్నుల సాయం తీసుకోవాలన్నారు.

తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు : రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, జనాభా వృద్ధిరేటు వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. జనాభా పెంచేందుకు జపాన్, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాలు అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. 2021 లెక్కల ప్రకారం రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు అత్యల్ప స్థాయికి పడిపోవడం, జాతీయ సగటులో మూడోవంతు మాత్రమే నమోదవ్వడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

2011లో రాష్ట్రంలో 7.10 శాతంగా ఉన్న జనాభా వృద్ధి రేటు దశాబ్దకాలంలో 3.5 శాతానికి పడిపోయిందని సీఎం తెలిపారు. ఆధారపడి జీవిస్తున్నవారు దేశంలో 48 శాతం ఉండగా, రాష్ట్రంలో ఇంకాస్త ఎక్కువగా 49.10 శాతం ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు తదితర అంశాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 0-14 ఏళ్ల చిన్నారులు 20.51 శాతం ఉంటే, 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్కులు 67.10 శాతం, 60 ఏళ్ల వయసు పైబడిన వారు 12.40 శాతం ఉన్నారు. వృద్ధుల సంఖ్య 2016తో పోలిస్తే 2021 నాటికి పెరుగుతూ వచ్చింది. ఒక్కో కుటుంబంలోని సగటు సభ్యుల సంఖ్య జాతీయ స్థాయిలో 4.1 ఉండగా, రాష్ట్రంలో 3.2 మాత్రమే ఉంది.

ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటేనే పోటీకి అర్హులు - సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు తగ్గిపోగా, జీవనకాలం పెరిగిందని తాజా గణాంకాల ద్వారా తెలుస్తోందని సీఎం అన్నారు. 2020 సంవత్సరానికి సంతానోత్పత్తి రేటు జాతీయ సగటు 2.0 ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో 1.5 మాత్రమే ఉందన్నారు. జీవితకాలం సగటు కూడా జాతీయ సగటు కన్నా రాష్ట్రంలో ఎక్కువగా ఉందని చెప్పారు. జాతీయ స్థాయిలో సగటు ఆయుర్దాయం 69 ఏళ్లు ఉంటే, రాష్ట్రంలో ఇది 70 ఏళ్లకు చేరిందన్నారు. రాష్ట్రంలో శిశుమరణాల రేటు కూడా తగ్గిందని, ప్రతి వెయ్యి మంది శిశువుల్లో మరణాల రేటు దేశంలో 28 ఉంటే, రాష్ట్రంలో 24గా నమోదైందని అధికారులు వివరించారు.

ఇంటింటికీ సోలార్‌ రూఫ్‌ టాప్‌ : రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, కుటుంబ సభ్యుల ప్రొఫైల్‌కు తగ్గట్టు ప్రభుత్వ పథకాలు అందించడంపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు. ప్రతి కుటుంబంలో ఒక ఎంట్రప్రెన్యూర్‌ ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. అభివృద్ధి, ఆర్ధిక రంగాల్లో ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తేనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని తెలిపారు. ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యం (పీ-4) విధానం కింద మరిన్ని ప్రాజెక్టులు ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశ్‌ పేదరికం లేని రాష్ట్రంగా అవతరిస్తుందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం పీ-4 ప్రాజెక్టుకి ఉత్తమ ఉదాహరణని చెప్పారు.

అమరావతికి ప్రజలు భూసమీకరణ విధానంలో భూములిచ్చారని, రాజధాని నిర్మాణ బాధ్యత ప్రభుత్వం తీసుకుందన్న చంద్రబాబు ప్రైవేటు సంస్థలు దీనిలో భాగస్వాములయ్యాయని గుర్తు చేశారు. ఈ విధానంలో ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రైవేటు సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. 'పీఎం సూర్యఘర్‌' పథకం కింద ఇంటింటికీ సోలార్‌ రూఫ్‌ టాప్‌ ఏర్పాటు ద్వారా సౌర విద్యుత్‌ ఉత్పత్తి కూడా ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమైందన్నారు. ఇదే తరహాలో మరిన్ని పీ-4 ప్రాజెక్టులు రాష్ట్రంలో ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు.

ప్రవాసాంధ్రుల సాయం తీసుకోవాలి :రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు పీ-4 వంటి కార్యక్రమాలు చేపడుతూనే, సమాజంలోని సంపన్నవర్గాల సాయం కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. చిన్న సాయంతో పెద్ద మార్పు సాధించవచ్చనే నమ్మకంతో సంపన్నులు, కార్పొరేట్‌ సంస్థలు ముందుకు వచ్చి దాతృత్వం చూపేలా వారిని చైతన్య పరచాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్, అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్, శివ్‌ నాడార్‌ ఫౌండేషన్, టాటా ఫౌండేషన్‌ వంటివి దాతృత్వంలో ముందున్నాయని అలాంటి సంస్థలతో పాటు, ప్రవాసాంధ్రుల సాయం తీసుకోవాలని సూచించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

'ఒక్కో జంట 16 మంది పిల్లల్ని ఎందుకు కనకూడదు?'- సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details