ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

ETV Bharat / state

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ - అమరావతిలో లా కాలేజీ - చంద్రబాబు కీలక నిర్ణయాలు - Chandrababu Review Meetings

Chandrababu on High Court Bench in kurnool : ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖలపై సమీక్షించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమని, ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని సీఎం వెల్లడించారు. అదేవిధంగా ముస్లింల పథకాలను పునర్ వ్యవస్థీకరించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

Chandrababu Review Meetings
Chandrababu Review Meetings (ETV Bharat)

Chandrababu Key Decisions on Review Meetings : సచివాలయంలో న్యాయశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేర‌కు సర్కార్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ మేరకు కేబినెట్ స‌మావేశంలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు ముఖ్యమంత్రి వెల్ల‌డించారు.

Law College in Amaravati : అదేవిధంగా రాజ‌ధాని అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషన్ లా స్కూల్ ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. బెంగుళూరుకు చెందిన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, గోవాలోని ఇండియా ఇంట‌ర్నేష‌న‌ల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల త‌ర‌హాలో ఉండాలని చెప్పారు. అలాంటి అంతర్జాతీయ ప్ర‌మాణాల‌తో కూడిన అత్యుత్త‌మ ఇనిస్టిట్యూట్​ను అమ‌రావ‌తిలో ఏర్పాటు చేసే ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

నెలకు రూ.10వేల గౌరవ వేతనం :జూనియర్ న్యాయవాదులకు నెలకు గౌరవ వేతనం కింద రూ.10,000లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పామని చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు వారికి చెల్లించేందుకు ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు సూచించారు. జూనియర్ న్యాయవాదులకు శిక్ష‌ణ కేంద్రం కోసం అకాడమీ ఏర్పాటు అంశంపైనా కసరత్తు చేయాలని సూచనలు చేశారు. అనంతరం ప్రాసిక్యూషన్ విభాగంపై అధికారులు ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే నమోదైన కేసులు, రుజువైన నేరాల అంశంలో శిక్షపడే శాతం పెరగాలని చంద్రబాబు అన్నారు. దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేసే పద్ధతులను అవలంభించాలని సూచించారు. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందనే నమ్మకం కలిగేలా న్యాయవ్యవస్థ ఉండాలని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడే విషయంలో లిటిగేషన్లు పెట్టాలని చెప్పారు. అయితే అనవసర వివాదాలు తెచ్చేలా లిటిగేషన్లు ప్రభుత్వం నుంచి ఉండకూడదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. న్యాయ‌శాఖపై మరింత సమగ్రంగా సమీక్ష చేయాల్సి ఉందన్న చంద్రబాబు మరిన్ని వివరాలతో రావాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

పథకాలను రీ స్ట్రక్చర్ చేయాలి :అంతకుముందు మైనారిటీ సంక్షేమ శాఖపై చంద్రబాబు సమీక్షించారు. ముస్లిం మైనారిటీ వర్గాలకు అందే పథకాలను పునర్ వ్యవస్థీకరణ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలు, ఎన్నికల్లో ప్రకటించిన హామీల నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పథకాల రూపకల్పన చేయాలని పథకాలను రీ స్ట్రక్చర్ చేయాలని చంద్రబాబు ఆదేశాలిచ్చారు.

ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద మంజూరైన రూ.447 కోట్లకు సంబంధించి పెండింగ్​లో ఉన్న పనులు పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో మంజూరై కొంత మేర నిర్మాణాలు జరిగిన షాదీకానాలు, ఇతర నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రారంభం కాని పనులను రద్దు చేసి పునఃసమీక్ష చేయాలని సూచించారు. కడపలో హజ్ హౌస్ కోసం నాడు తెలుగుదేశం సర్కార్ రూ. 24 కోట్లు మంజూరు చేసిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అందులో రూ.15 కోట్లతో 80 శాతం నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఈ హజ్ హౌస్ నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులకు సూచనలు చేశారు.

మైనారిటీ విభాగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు శిక్షణా సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. అలాగే గుంటూరు క్రిస్టియన్ భవన్​కు నాడు తెలుగుదేశం ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేయగా 50 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. ఈ క్రమంలోనే వక్ఫ్ బోర్డు భూముల సర్వే రెండేళ్లలో పూర్తి చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలిచ్చారు.

స్కీమ్స్​ను రీ స్ట్రక్చర్ చేయాలి : మైనారిటీలకు ఇచ్చే ఎకనమిక్ సపోర్ట్ స్కీమ్స్​ను రీ స్ట్రక్చర్ చేయాలని చంద్రబాబు సూచించారు. వక్ఫ్ బోర్డ్ భూముల డెవలప్​మెంట్​ ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు. ఆ భూములను అభివృద్ధి చేయాలని అందులో ఆ వర్గానికి చెందిన వారే భాగస్వాములుగా ఉండేలా చూడాలన్నారు. తద్వారా వక్ఫ్ బోర్డుకు ఆదాయం తేవడంతో పాటు వాటి అభివృద్ధి ఫలాలు ఆ వర్గానికే అందేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

నూర్‌బాషా కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం :అదేవిధంగా నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటుకు చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. ప్రభుత్వ శాఖలు మత కార్యక్రమాల్లో అనవసర జోక్యం చేసుకోవద్దని వారి గౌరవాలకు భంగం కలగకుండా ప్రభుత్వ శాఖలు పనిచేయాలని సీఎం సూచించారు. అర్హత ఉన్న ఇమామ్​లను ప్రభుత్వ ఖాజీలుగా నియమించాలని పేర్కొన్నారు. మసీదుల నిర్వహణకు రూ.5,000ల ఆర్థికసాయం, హజ్ యాత్రకు వెళ్లే వారికి రూ.1 లక్ష సాయం ఇచ్చే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్రిస్టియన్లకు స్మశాన వాటికలు కేటాయింపు కోసం జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రక్రియ మొదలు పెట్టాలని చంద్రబాబు సూచనలు చేశారు.

'జగన్ అతి పెద్ద లిక్కర్ సిండికేట్' - నూతన మద్యం విధానంపై సీఎంతో మంత్రుల సమావేశం - CM Review on New Liquor Policy

గ్రామాల్లోనూ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం- రైతుల భాగస్వామ్యంతో MSME పార్కులకు కసరత్తు - CM Chandrababu on food processing

ABOUT THE AUTHOR

...view details