CM Chandrababu Reveals Details of AP Debts:రాష్ట్రం మొత్తం అప్పు ప్రస్తుతం రూ.9.74 లక్షల కోట్లు ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. కాదని ఎవరైనా అంటే అసెంబ్లీకి రండి తేల్చుతానని సవాల్ విసిరారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఆర్థిక ఉగ్రవాదాన్ని సృష్టించిందని మండిపడ్డారు. ప్రజలు విశ్వసించి ఓటేస్తే దుర్మార్గంగా ప్రవర్తించారని ఆరోపించారు. గత ప్రభుత్వం సంపద సృష్టించేలా ఒక్క పని కూడా చేయలేదని అన్ని రంగాలను సర్వనాశనం చేసిందని తెలిపారు. ఆస్తులు తాకట్టుపెట్టి అప్పులు తెచ్చిందని అన్నారు.
ఐదేళ్లలో ఎంతో ఆదాయం తగ్గింది: ఇప్పటి వరకు గత ప్రభుత్వం చేసిన అప్పు రూ. 9,74,556 కోట్లు గా ఇప్పటికి తేలిందని సీఎం అన్నారు. ఇప్పుడు తలసరి అప్పు 1.44 లక్షలుగా ఉందని, తమ ప్రభుత్వం ఏదీ దాచటం లేదని అందుకే బహిర్గతం చేస్తున్నామన్నారు. జగన్ హయాంలో వ్యక్తిగత ఆదాయంతో పాటు రాష్ట్ర ఆదాయం కూడా తగ్గిందని అన్నారు. వ్యవసాయంలో వృద్ధి టీడీపీ హయాంలో 16 శాతానికి పైగా ఉంటే వైఎస్సార్సీపీ వచ్చాక 10 శాతానికి తగ్గిందన్నారు. ఇలా అన్ని వ్యవస్థలూ కలిపి వృద్ధి రేటు 10.6 శాతానికి పడిపోయిందని అన్నారు. ఐదేళ్ల కాలంలో 6.94 లక్షల కోట్ల మేర రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణాతో పోలిస్తే ఏపీ 1.14 లక్షల మేర తక్కువ ఉందని అన్నారు. మరో ఐదేళ్లు వైఎస్సార్సీపీ అధికారంలో ఉంటే ఇంకా అంధకారంలో కూరుకుపోయేవాళ్లమన్నారు.
అప్పుల వివరాలు...
- రాష్ట్ర మొత్తం అప్పు: రూ.9,74,556 కోట్లు
- ప్రభుత్వ అప్పు రూ.4.38 లక్షల కోట్లు
- కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పు రూ.2.48 లక్షల కోట్లు
- పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ రూ.80,914 కోట్లు
- పౌరసరఫరాలశాఖ కార్పొరేషన్ అప్పు రూ.36 వేల కోట్లు
- విద్యుత్ రంగం అప్పులు రూ.34,267 కోట్లు
- అవుట్‌స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ పథకాల అప్పు రూ.లక్షా 13 వేల కోట్లు
- అవుట్‌స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ అప్పులు రూ. 21,980 కోట్లు
- నాన్‌కంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ అప్పులు రూ.1,191 కోట్లు