CM Chandrababu Released White Paper: వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన సహజ వనరుల దోపిడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని, కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీ పాల్పడ్డారని అన్నారు.
అడవులను కూడా ధ్వంసం చేశారు:విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూకబ్జాలకు పాల్పడ్డారన్న చంద్రబాబు, ఇళ్ల నిర్మాణం పేరుతో వైఎస్సార్సీపీ నేతలు దందా చేశారని దుయ్యబట్టారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలకు అసైన్డ్ భూములు అప్పగించారని అన్నారు. అసైన్డ్ భూములను ఇతరులకు కేటాయించడం నేరమన్న చంద్రబాబు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూదోపిడీకి కుట్ర పన్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం అడవులను కూడా ధ్వంసం చేసిందని ధ్వజమెత్తారు.
భూఅక్రమాలకు లెక్కే లేదు:రామానాయుడు స్టూడియో భూములు కొట్టేసేందుకు విఫలయత్నం చేశారన్న చంద్రబాబు, వృద్ధాశ్రమానికి ఇచ్చిన హయగ్రీవ ల్యాండ్స్‌ను కూడా కొట్టేశారని అన్నారు. దసపల్లా భూములను కొట్టేసి ఇళ్లు కట్టారని, మాజీ ఎంపీ ఎంవీవీ అనేక భూఅక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ఒంగోలులో నకిలీ పత్రాలతో రూ.101 కోట్ల ఆస్తి కాజేసేందుకు యత్నించారని, భూకబ్జాలపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టామని అన్నారు. తిరుపతి, రేణిగుంటలోని మఠం భూములను కొట్టేశారన్న చంద్రబాబు, తిరుపతి జిల్లాలో భూఅక్రమాలకు లెక్కే లేదన్నారు.
22-ఏ పెట్టి భూఅక్రమాలు చేశారని, చిత్తూరులో 782 ఎకరాలు కాజేసేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చర్యలు చేపట్టానన్న చంద్రబాబు, పుంగనూరులో 982 ఎకరాలను పట్టా చేయించుకున్నారని పేర్కొన్నారు. పేదవారి అసైన్డ్ భూములను వైఎస్సార్సీపీ నేతలు లాక్కున్నారని, హౌసింగ్ కాలనీ ఎక్కడ రావాలో వారే నిర్ణయించేవారని ఆరోపించారు. ముందే స్థలం కొనేవారని, అనేక రెట్ల పరిహారం కొట్టేసేవారని మండిపడ్డారు. గ్రామాల్లో ఉండే ఖాళీ భూములను ఆక్రమించారన్న చంద్రబాబు, నివాసయోగ్యం కాని ఆవ భూములను కేటాయించారని విమర్శించారు.
'విద్యుత్ రంగంపై 1,29,503 కోట్ల నష్టం'- రూ.500, 200 నోట్లను కూడా రద్దు చేయాలి : చంద్రబాబు - white paper on power sector
ప్రశ్నించే వారిపై దాడులు: అక్రమంగా భవనాలు కట్టేశారని, ప్రశ్నించే వారిపై దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 వేల 800 ఎకరాలను వైఎస్సార్సీపీ నేతలకు ధారాదత్తం చేశారని, తక్కువ ధరకు 40 వేల ఎకరాలు కొన్నారని తెలిపారు. అధికారులను బెదిరించి భూములకు పట్టాలు తెచ్చుకునేవారని, భూహక్కు పత్రం పేరుతో ప్రచారానికి రూ.13 కోట్లు ఖర్చు చేశారన్నారు.
ఒకసారి భూములను చెక్ చేసుకోండి: భూముల రీసర్వే పేరుతో జగన్ చిత్రం ముద్రించుకున్నారని, ల్యాండ్ టైటిలింగ్ చట్టం మేరకు ప్రైవేట్ వ్యక్తులను నియమించవచ్చని తెలిపారు. ఎంతో అహంభావంతో ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చారన్న చంద్రబాబు, ఈ చట్టం దురుద్దేశాలను ప్రజలు గ్రహించారన్నారు. ఒకసారి భూములను చెక్ చేసుకోవాలని ప్రజలను కోరారు. భవిష్యత్తులో భూకబ్జా చేయాలంటే భయపడేలా చేస్తామని హెచ్చరించారు. భూములు, ఆస్తులు కబ్జాకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలన్నారు. గుజరాత్‌లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఇక్కడా తెస్తామని తెలిపారు. తాము భూమి యాజమానులని కబ్జాదారులే నిరూపించుకోవాలని స్పష్టం చేశారు.
మైనింగ్, క్వారీ లీజుల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారని, బెదిరింపులు, భారీ జరిమానాలతో అనేక గనులు కొల్లగొట్టారన్నారు. గనుల కేటాయింపులో పారదర్శకత తీసుకువస్తామన్న చంద్రబాబు, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి గనులు తవ్వేశారని ఆరోపించారు. గనుల కేటాయింపులో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ నిబంధనలకు తూట్లు పొడిచారని పేర్కొన్నారు.
ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీలను తెచ్చారని, అధికారులను డిప్యుటేషన్‌పై తెచ్చుకుని అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఇసుక తవ్వకాల్లో అక్రమంగా భారీ యంత్రాలు వాడారని, దీని కోసం నదులు, కాలువలపై రోడ్లు వేశారని మండిపడ్డారు. ఇసుక దందాను ప్రశ్నించే వారిపై అట్రాసిటీ కేసులు పెట్టారని, కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో భారీ ఇసుక దందాలు జరిగాయని పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ భూఅక్రమాలపై పూర్తి వివరాలివ్వండి - అధికారులకు చంద్రబాబు ఆదేశం - White Paper on YSRCP Land Grabs
అనేకమంది ఆత్మహత్య చేసుకున్నారు:వైఎస్సార్సీపీ నేతలకు కప్పం కట్టలేక అనేకమంది ఆత్మహత్య చేసుకున్నారన్న చంద్రబాబు, ఇసుక దందాలో రూ.9,750 కోట్లు కొట్టేశారని తెలిపారు. అటవీ, గనులశాఖను సాధారణంగా ఒక వ్యక్తికి ఇవ్వరని, కానీ వైఎస్సార్సీపీ హయాంలో అటవీ, గనులశాఖ ఒకే వ్యక్తికి అప్పగించారన్నారు. తూ.గో.జిల్లాలో లేటరైట్ గనులను బలవంతంగా లాక్కున్నారన్న చంద్రబాబు, ప్రకాశం జిల్లాలో 250 క్వారీలపై దాడులు చేశారని అన్నారు. చిత్తూరు జిల్లాలో టార్గెటెడ్ ఇన్‌స్పెక్షన్ల పేరుతో వేధించారని, కుప్పం నియోజకవర్గంలోనే అక్రమంగా గనులు తవ్వేశారన్నారు.
గనుల బాధితులు ముందుకు రావాలి:పర్యావరణాన్ని దెబ్బతీస్తే భావితరాలు దెబ్బతింటాయన్న చంద్రబాబు, ప్రకృతి సంపద ప్రజలకు చెందాలని స్పష్టం చేశారు. గనుల బాధితులు ముందుకు రావాలని, ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని కోరారు. చివరికి అమరావతి రోడ్డుపై ఉన్న మట్టిని తవ్వుకుని పోయారని తెలిపారు. దౌర్జన్యం, బెదిరింపులు, జరిమానాల పేరుతో గనుల దోపిడీ జరిగిందని ధ్వజమెత్తారు. ఆఖరికి ద్రవిడ యూనివర్సిటీలో అక్రమంగా మైనింగ్ చేశారని, నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ ఖనిజాన్ని ఇష్టానుసారం దోపిడీ చేశారని వెల్లడించారు.
చైనాకు ఎర్రచందనం దొంగరవాణా:ఎర్రచందనం దొంగరవాణా కోసం అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఎర్రచందనాన్ని దొంగరవాణా చేసి చైనాకు పంపారని అన్నారు. ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని తగ్గించారని, స్మగ్లర్లను వైఎస్సార్సీపీ నేతలు ప్రోత్సహించారని ఆరోపించారు. స్మగ్లర్లను ప్రోత్సహించడం సమాజానికి చాలా ప్రమాదమన్న చంద్రబాబు, పల్నాడు జిల్లాలో ఇష్టానుసారం అటవీసంపద కాజేశారని ధ్వజమెత్తారు. చారిత్రక ప్రాంతాల్లోనూ అడవులు కొట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అడవులు మింగేసిన అనకొండలను శిక్షిస్తాం: రుషికొండలో రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టారని, ప్రజాధనాన్ని అడ్డంగా దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. భీమిలి ఎర్రమట్టి దిబ్బలను పూర్తిగా మింగేశారని, ప్రభుత్వ, ప్రైవేట్ భూముల పరిరక్షణకు ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. భూగర్భ ఖనిజ సంపద సమాజహితానికి వినియోగించాలని కోరారు. వైఎస్సార్సీపీ బాధిత గనులు, క్రషర్ల యజమానులు ముందుకు రావాలన్నారు. అడవులు మింగేసిన అనకొండలను శిక్షిస్తామని హెచ్చరించారు.
అమరావతిపై చంద్రబాబు శ్వేతపత్రం - రాజధాని పునర్నిర్మాణ ప్రణాళికపై దశ, దిశ - white paper on capital Amaravati
దోపిడీదారులను వదిలిపెట్టం:గతంలో తిరుపతి జిల్లాలోని కొండలపై ఔషధ మొక్కలు పెంచామని, విశాఖ కొండలపై వివిధరకాల పూలమొక్కలు ఉండాలనేది తన కల అని చంద్రబాబు స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ పాలనతో ప్రభుత్వ యంత్రాంగం నిర్వీర్యంగా మారిందని, గనుల దోపిడీ కోసం అధికారులను బెదిరించారని, బదిలీలు చేశారని ఆరోపించారు.
వైఎస్సార్సీపీ నేతల దోపిడీకి కొందరు అధికారులు సహకరించారన్న చంద్రబాబు, భూకబ్జాలు, గనులు, అటవీసంపదను దోచిన వారిని శిక్షిస్తామని తెలపారు. ఎర్రచందనం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నేరస్థులు, దోపిడీదారులను వదిలిపెట్టమని, కఠినంగా శిక్షిస్తామన్నారు. టీడీఆర్ బాండ్లు, రేషన్ బియ్యంలోనూ అక్రమాలకు పాల్పడ్డారన్న చంద్రబాబు, దొంగకు తాళాలిచ్చి దోచుకునేలా ప్రోత్సహించారని మండిపడ్డారు.
భూకబ్జాలపై టోల్ ఫ్రీ నెంబరు: అవినీతిపరులు ఎంత పెద్దవారైనా వదిలేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. భోగాపురం విమానాశ్రయ భూములు లాక్కున్న వారిపై చర్యలు తప్పవన్నారు. భూకబ్జాలపై టోల్ ఫ్రీ నెంబరు ద్వారా ఫిర్యాదు తీసుకుంటామన్నారు. భూముల రీసర్వే పేరుతో నష్టపోయిన వారికి న్యాయం చేస్తామన్న చంద్రబాబు, దోపిడీ చేసిన మొత్తాన్ని సాధ్యమైనంత త్వరగా వసూలు చేస్తామని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో జరిగిన దోపిడీపై ప్రజల్లో చర్చ జరగాలన్న చంద్రబాబు, వైఎస్సార్సీపీ నేతల దోపిడీపై శాసనసభలో చర్చిస్తామన్నారు.
షాక్ ట్రీట్‌మెంట్ తప్పదు:గంజాయి, మద్యం మత్తుతో దారుణాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న చంద్రబాబు, ఇప్పటికే రెండుసార్లు హెచ్చరించామని, ఇకనుంచి కఠినంగా ఉంటామన్నారు. గంజాయి, మద్యం మత్తుతో రోడ్డుపైకి వచ్చేవారు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఇంకా మత్తులో ఉండేవారికి షాక్ ట్రీట్‌మెంట్ తప్పదని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు శాపంలా జగన్ - నిపుణుల కమిటీ నివేదికే కీలకం: చంద్రబాబు - white paper on the Polavaram