CM Chandrababu Speech in AP Assembly: 'కన్న తల్లి శీలాన్ని శంకించే వారు మనుషులా, పశువులా? తల్లి వ్యక్తిత్వాన్నే హననం చేసేవారికి మనం ఒక లెక్కా? కన్న తల్లిపైనా సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే ఏమనుకోవాలి? గత ఐదు సంవత్సరాలల్లో ఏపీలో సోషల్ మీడియా సైకోలను తయారు చేశారు' అని సీఎం నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం, అప్పులపై అసెంబ్లీలో శుక్రవారం చంద్రబాబు ప్రసంగిస్తూ ఎన్డీఏ కూటమిలోని నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ అసభ్య పోస్టులు పెట్టరని తెలిపారు. ఒకవేళ పెడితే వారినీ శిక్షిస్తాం స్పష్టం చేశారు. ఆడబిడ్డలు గౌరవంగా బతికేలా చేస్తామని, రాబోయే రోజుల్లో ఏ ఆడబిడ్డా అవమానపడడానికి వీల్లేదని, చట్టానికి పదును పెట్టి కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు.
రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం :గత ఐదు సంవత్సరాలల్లో అప్పులు తెచ్చినా మూలధన వ్యయం చేయలేదని, ఏపీలోని రహదారులన్నీ గుంతలు పడ్డాయని, వీటికి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని సీఎం ఆరోపించారు. ఏపీని అప్పులు తీర్చలేక ఐపీ పెట్టిన వ్యక్తిలా మార్చేశారని, పొలంలోకి అడవి పందులు వస్తే అవి తిన్నంత తిని, మిగతా పంటను నాశనం చేసి పోతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత పాలకులు ఇలానే వ్యవహరించారని, పెట్టుబడులు పెట్టేవారిని తరిమేశారని, ఇది కోపంతోనో ఆవేశంతోనో అనడం లేదని, బాధతో మాట్లాడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అప్పులు, పాపాలు, నేరాలే రాష్ట్రానికి శాపంగా మారాయని, రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయని అనుకోవడం లేదని అన్నారు. ఒక్కో ఇటుకా పేర్చుతూ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తూ కేంద్రం సహకారంతో ముందుకెళుతున్నామని చంద్రబాబు వివరించారు.
రాష్ట్రం అప్పు 9.74 లక్షల కోట్లు - ఎవరైనా కాదంటే రండి తేల్చుతా : సీఎం చంద్రబాబు
మాపై బాధ్యత ఉంది :రాజకీయాల్లో అవినీతి చూసి ఉంటామని, కానీ అక్రమాలు, అవినీతి చేయడానికే రాజకీయాల్లోకి వచ్చిన వారిని చూస్తున్నామని చంద్రబాబు అన్నారు. టీడీపీ స్థాపించి ఇప్పటికి 45 సంవత్సరాలు అయిందని, తమకు టీవీ, పేపర్లు లేవని, కానీ, వారు అధికారంతో అవన్నీ ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. మద్యం ఆదాయాన్ని పూచీకత్తుగా చూపి రూ.25వేల కోట్ల అప్పులు తెచ్చారని, 2019కి ముందు మంత్రిగా ఉన్న నారా లోకేశ్ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని, 24 వేల కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లు వేయించారని తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూ.4,500 కోట్లతో 30వేల పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో జల్‌జీవన్ మిషన్‌ను అస్తవ్యస్తం చేశారని, ప్రయోగాలతో విద్యావ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. ఆంగ్ల మాధ్యమాన్ని వారే ప్రవేశపెట్టినట్లు అంతకుముందు లేనట్లు ప్రవర్తించారని అన్నారు. ఎవరైనా మాట్లాడితే వ్యతిరేకులుగా చిత్రీకరించారని, రాజకీయ ముసుగులో నేరాలు చేయాలనుకునే వారి ముసుగు తొలగిస్తామని హెచ్చరించారు. సభకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాకపోవచ్చని, కానీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు.
సూపర్ సిక్స్‌తో పాటు మరిన్ని పథకాలు అమలుచేస్తాం :దీపం-2 కింద సిలిండర్ డబ్బులు లబ్ధిదారులకు నేరుగా అందించే విధానాన్ని త్వరలో తీసుకొస్తామని, దీనిపై కేంద్రంతో మాట్లాడుతున్నామని తెలిపారు. రైల్వేజోన్‌కు భూమి కేటాయించామని వెల్లడించారు. త్వరలో ప్రధాని మోదీ భూమిపూజ చేస్తారని, డిసెంబరులో లక్ష ఇళ్లలో గృహ ప్రవేశాలు నిర్వహిస్తామని, ఇల్లులేని పేదలు ఎవ్వరూ లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. త్వరలో పర్యాటక పాలసీ తీసుకొస్తామని, గోదావరి-కృష్ణా-పెన్నా అనుసంధానం చేస్తే రాష్ట్రంలో కరవు ఉండదని తెలిపారు. 150 రోజుల్లో రూ.లక్ష కోట్ల పెట్టుబడులకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తాన్ని రూ.10వేలకు పెంచామని, వేద విద్య అభ్యసించిన వారికి రూ.3వేల భృతి అందిస్తున్నామని, రైతులకు చెల్లించాల్సిన రూ.1,670 కోట్ల బకాయిలు చెల్లించామని అన్నారు. సూపర్‌సిక్స్ హామీలను పూర్తిగా అమలు చేయడమే కాకుండా అదనంగా మరిన్ని పథకాలు అమలు చేస్తామని సీఎం వెల్లడించారు.