CM Chandrababu Naidu Review on Rains : భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై చంద్రబాబు నాయుడు సమీక్షించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులతో సీఎం రివ్యూ చేశారు. వర్షాలు అధికంగా ఉన్న ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ :భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో ఉన్న తాజా పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ శాఖ ద్వారా వర్షాలు, వరదలను అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు. ముందస్తు ప్రణాళికతో పని చేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ఈ ఏడాది లో ఇప్పటి వరకు సాదారణ వర్షపాతం 185 మిల్లీ మీటర్లకు గాను 244 మిల్లీ మీటర్లు నమోదైందని, రాష్ట్ర వ్యాప్తంగా 31 శాతం అదనంగా వర్షపాతం నమోదైందని అన్నారు. 13 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయిన ప్రాంతాలు కూడా ఉన్నాయన్నాన్న సీఎం చెరువు కట్టలు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు.