CM Chandrababu Naidu Restarts Amaravati Capital Works :రాజధాని పనుల పునఃప్రారంభానికి మరిన్ని సానుకూల అడుగులు పడుతున్నాయి. పాత టెండర్లు రద్దు చేసిన సీఆర్డీఏ (CRDA: Capital Region Development Authority) కొత్త టెండర్లకు మార్గం సుగమం చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మధ్యలో ఆపేసిన నిర్మాణాల్ని పూర్తి చేయడమే ప్రథమ ప్రాధాన్యంగా త్వరలోనే ప్రజాప్రతినిధులు, అఖిలభారత సర్వీసు అధికారుల భవనాల పనులు పట్టాలెక్కనున్నాయి.
అమరావతి నిర్మాణ పనులకు కూటమి ప్రభుత్వం ఒక్కో అడ్డంకీ తొలగించుకుంటూ ముందుకు వెళ్తోంది. ముందుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారుల కోసం నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ టవర్లలో పెండింగ్ పనుల పూర్తి చేయాలని నిర్ణయించారు. ఐదేళ్లపాటు ఆ నిర్మాణాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం గాలికి వదిలేయటంతో భవనాల సామర్థ్యం ఎలా ఉందనేది చెన్నై, హైదరాబాద్ నిపుణులతో పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేవని నివేదిక అందడంతో పెండింగ్ పనులు పూర్తి చేయటానికి సిద్ధమయ్యారు. దీనికోసం రూ. 524 కోట్ల రూపాయలతో సీఆర్డీఏ అంచనాలు సిద్ధం చేసింది. కొత్తగా టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వ అనుమతి పొందింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారుల కోసం, 12 అంతస్తులతో 18 టవర్లు నిర్మిస్తున్నారు.
టెండర్లు పిలిచి, పనులు అప్పగించిన 9నెలల్లోగా టవర్లను అందుబాటులోకి తేవాలని, ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచబ్యాంకు, ఏడీబి, హడ్కో వంటి సంస్థలతో రుణమంజూరు ప్రక్రియ త్వరలో పూర్తి కానుంది. ఈలోగా టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టాలని సీఆర్డీఏ భావిస్తోంది. అమరావతికి అన్నీ మంచి శకునాలేనని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఐదేళ్ల విరామం తర్వాత నిర్మాణా పూర్తి చేయాల్సిరావటంతో అంచనా వ్యయం గణనీయంగా పెరిగింది. మొత్తం 18 టవర్ల నిర్మాణాన్ని 2017లో 700 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేనాటికే 18 టవర్ల సివిల్ స్ట్రక్చర్ల నిర్మాణం 90శాతం పూర్తయింది. దీని కోసం సీఆర్డీఏ 395 కోట్లు వెచ్చించింది.