CM Chandrababu Congratulations to Indian Cricket Team :టీ20 ప్రపంచ కప్ కైవసం చేసుకున్న భారత జట్టును గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ అభినందనలతో ముంచెత్తారు. భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్రను తిరగరాసిందని సీఎం చంద్రబాబు కొనియాడారు. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్‌ను కలను రోహిత్ సేన సాకారం చేసిందని ప్రశంసించారు. భారత క్రికెట్ జట్టు, సహాయక సిబ్బంది దేశాన్ని ఆనంద డోలికల్లో ముంచెత్తినందుకు అందరికీ అభినందనలు తెలిపారు.
17ఏళ్ల నిరీక్షణకు తెర - విశ్వవిజేతగా భారత్ - T20 WORLD CUP 2024 FINAL
ఈ విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి :టీ20 ప్రపంచ కప్‌లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తుది పోరులో జట్టు మొత్తం సమష్టిగా రాణించిన తీరు అద్భుతమని కొనియాడారు. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఒత్తిడిని జయంచి సగర్వంగా ప్రపంచకప్ సాధించి పెట్టిన భారత క్రికెటర్లకు పేరు పేరునా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి దాయకమని అన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ క్రికెట్‌లో భారత్ మరిన్ని విజయాలు అందుకోవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.
సూర్య కుమార్ యాదవ్ క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పారు :భారత్ జట్టు టీ20 ప్రపంచ కప్ గెలిచిన తీరు అద్భుత మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. రోహిత్ సేన ట్రోఫీని గెలుచుకుని చరిత్ర సృష్టించిందని ప్రశంసించారు. సూర్య కుమార్ యాదవ్ చివరి ఓవర్‌లో తీవ్రమైన ఒత్తిడిలోనూ అద్భుతమైన క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పారని లోకేశ్ అభినందించారు. టీం ఇండియాను చూసి దేశం గర్విస్తోందంటూ ట్వీట్ చేశారు.