CM Chandrababu Naidu Attend Parent Teacher Meeting in Bapatla: ప్రైవేట్ పాఠశాలలకే పరిమితమైన పేరెంట్ - టీచర్ మీటింగ్ సర్కారీ బడుల్లోనూ జరగబోతోంది. నేడు ఒకేరోజు వేల ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించనున్నారు. బాపట్లలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ విద్యార్థుల ప్రగతి నివేదికలు పరిశీలించి తల్లిందండ్రులతో ముచ్చటిస్తారు. కడప మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొంటారు.దేశంలో అతి పెద్ద రాష్ట్రాల్లో ఈ స్థాయిలో సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి.
కలిసి భోజనం చేయనున్న చంద్రబాబు, లోకేశ్ : రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరగనుంది. 35,84,621 మంది విద్యార్థులు, 71,60,000ల మంది తల్లిదండ్రులు, 1,88,266 మంది ఉపాధ్యాయులు, 58,000లకు పైగా ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ పాల్గొననున్నారు. విద్యార్థులతో ముఖ్యమంత్రి, మంత్రి ముచ్చటించి, వారి ప్రగతి నివేదికలు పరిశీలిస్తారు. తర్వాత తల్లిదండ్రులు, పూర్వవిద్యార్థుల సూచనలు, సలహాలు వింటారు.
ఈ క్రమంలోనే విద్యార్థుల తల్లిదండ్రులు సహపంక్తి భోజనాలకు 23 ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ పిల్లలతో కలిసి భోజనం చేయనున్నారు. 1901లో ఏర్పాటైన బాపట్ల పాఠశాల పూర్వవిద్యార్థులనూ ఈ సమావేశానికి ఆహ్వానించారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరగబోయే పేరెంట్ - టీచర్ మీటింగ్‌కి తనను ఆహ్వానించినందుకు పాఠశాల యాజమాన్య కమిటీకి లోకేశ్ ధన్యవాదాలు చెప్పారు.