CM Chandrababu Kuppam Tour:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండోరోజుల పర్యటన ముగిసింది. రెండోరోజు ఉదయం కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సీఎంతో కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు చిత్తూరు జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజల నుంచి వినతి పత్రాలు సేకరించడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. అతిథిగృహం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో సచివాలయ ఉద్యోగులకు విధులు కేటాయించారు. వినతిపత్రాలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజల వివరాలు నమోదు చేసుకుని శాఖలవారిగా జాబితా రూపొందించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పాల్గొన్న చంద్రబాబు అనంతరం కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పేదరికం లేని సమాజం కోసం వేసే తొలి అడుగు కుప్పం నుంచే మొదలుపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదరికం లేని గ్రామం, పేదరికం లేని మండలం, పేదరికం లేని నియోజకవర్గంగా ముందు కుప్పాన్ని తయారు చేస్తామన్నారు. దీని కోసం ఒక ప్రణాళికతో అధికారులు పనిచేయాలన్నారు. గత పాలనకు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉండబోతుందని సీఎం అన్నారు. బలవంతపు జనసమీకరణతో పెద్ద పెద్దమీటింగ్లు, భారీ కాన్వాయ్‌లతో సైరన్ల మోతతో హంగామాలు తమ ప్రభుత్వంలో ఉండవని తెలిపారు. సాయంత్రం 6 గంటల తర్వాత సమావేశాలు వద్దని మంత్రులకు ఇప్పటికే చెప్పానన్నారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్- ఎస్పీ కార్యాలయానికి తరలింపు - Pinnelli Ramakrishna Reddy Arrest
రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రణాళికపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. కుప్పం సమగ్ర అభివృద్ధికి సమగ్ర కార్యప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. తన ప్రాధాన్యం, ఆలోచనలు, నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి, అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదని అధికారులకు చంద్రబాబు తెలిపారు. రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు రౌడీ షీట్లు ఎత్తి వేయాలన్నారు.