CM Chandrababu Inspected Grain Purchase Centers:ధాన్యం సేకరణ మొదలు రైతులకు నగదు చెల్లించే వరకూ ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు అధికారులకు తేల్చిచెప్పారు. తేమ శాతంలో ఖచ్చితత్వం ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు పెట్టుబడి వ్యయం తగ్గించి దిగుబడి, ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. గంగూరు, ఈడుపుగల్లు గ్రామాల్లో సీఎం పర్యటన కొనసాగింది. గంగూరు రైతు సేవాకేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించి ధాన్యం సేకరణ మొదలు మిల్లులకు ఎగుమతి చేసే ప్రక్రియ మొత్తాన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సిబ్బంది, రైతులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
తప్పు జరిగితే కఠిన చర్యలు: పండించిన పంటకు మద్ధతు ధర లభిస్తుందా లేదా అని రైతులను సీఎం స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఐవీఆర్‌ఎఫ్ ద్వారా రైతుల నుంచి తానే స్వయంగా అభిప్రాయాలు సేకరిస్తానని తెలిపారు. అధికారుల నుంచి తనకు కావాల్సింది డాక్యుమెంటేషన్ కాదని రైతులకు సేవ చేసే విషయంలో ఇంప్రూవ్‌మెంట్ కనిపించాలని తేల్చిచెప్పారు.
తేమ శాతం నమోదు, ఇతరత్రా అంశాల్లో ఎగుమతి, దిగుమతి దగ్గర ఒకేలా కచ్చితత్వం ఉండాలన్న ఇందులో ఎక్కడ తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తూకంలో హెచ్చుతగ్గులు, తేమశాతంలో లొసుగులు వంటి అంశాలను సీఎం స్వయంగా తెలుసుకున్నారు. తేమశాతం నిర్ధారణ చేసే మిషన్ పనితనాన్ని స్వయంగా పరిశీలించారు. ఐవీఆర్‌ఎఫ్ ద్వారా ఎప్పటికప్పుడు తనకు ఫీడ్ బ్యాక్ పంపాలని సీఎం సూచించారు.
సడన్ విజిట్స్ పెంచుతా:ధాన్యం దిగుబడిలో మెకనైజేషన్ పెంచి రైతుల ఆదాయం పెంచే చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. దిగుబడి పెరిగి డబ్బు సకాలంలో చేతికొస్తుండటంతో రైతులు గత ఏడాది కంటే ఇప్పుడు సంతోషంగా ఉన్నారని అన్నారు. రైతు సేవా కేంద్రాల్లో తేమ శాతం ఒకలా ఉంటే మిల్లర్ల వద్ద మెషీన్లలో మరోలా ఉంటోందన్నారు.
ధాన్యం సేకరణ కేంద్రాలను ఇకనుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తానని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. సాంకేతికత సక్రమ వినియోగంతో రైతుల ఖర్చు తగ్గించి ఎక్కువ లాభం వచ్చేలా చేస్తామని చెప్పారు. లాభసాటి వ్యవసాయంపై రైతుల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున చర్చలు చేపడతామని వెల్లడించారు. దళారీ ముసుగులో రైతులకు ఎవరు అన్యాయం చేయాలని చూసినా ఉపేక్షించనని హెచ్చరించారు.