CM Chandrababu Inspected Flood Areas With Boat in Vijayawada :విజయవాడలో ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పడవలో వెళ్లి సింగ్‌నగర్, తదితర వరద ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. భద్రతా సిబ్బంది వద్దంటున్నా కూడా ఆయన వినకుండా పడవలో వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సింగ్‌నగర్ గండి పూడ్చడంపై ఆయన అధికారులతో మాట్లాడారు. బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.
అధికారులతో సీఎం సమీక్ష: బాధితుల ఇబ్బందులను దగ్గరుండి చూశానని, వరదనీరు తగ్గే వరకు పరిస్థితి పర్యవేక్షిస్తానని సీఎం అన్నారు. బాధితులకు వెంటనే ఆహారం, తాగునీరు అందిస్తామన్నారు. ఆరోగ్యం బాగాలేని వారిని ఆసుపత్రులకు తరలిస్తామని చెప్పారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు మీ దగ్గర్లోనే ఉంటానని బాధితులకు చంద్రబాబు భరోసా కల్పించారు. అనంతరం ఆయన విజయవాడ కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
బుడమేరు వరద బాధితుల కష్టాలు తీర్చే వరకూ విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. పాలు, ఆహారం, నీరు, కొవ్వొత్తులు, టార్చిలైట్‌లు వెంటనే అన్ని ప్రాంతాల నుంచీ తెప్పించాలని సూచించారు. లక్ష మందికి సరిపోయేలా ఆహారం సరఫరా చేయాలని చంద్రబాబు నిర్దేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలన్నసీఎం తక్షణం అందుబాటులో ఉన్న ఆహార పొట్లాలను బాధితులకు అందించాలన్నారు. వృద్ధులు, పిల్లలను వరద ప్రాంతాల నుంచి వెంటనే తరలించాలని సూచించారు. విజయవాడలో అన్ని షాపుల నుంచి వాటర్ బాటిళ్లను తెప్పించాలన్నారు. బుడమేరులో ఊహించని స్థాయి వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని సీఎం తెలిపారు.