AP CM ChandraBabu Naidu Inaugurated Anna Canteen : మూడు పూటలా పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పునః ప్రారంభించారు. కృష్ణా జిల్లా గుడివాడలో 'అన్న క్యాంటీన్'ను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు దంపతులు పలువురికి భోజనం వడ్డించారు. పేదలతో కలిసి భోజనం చేశారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
2014 - 2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన అన్న క్యాంటీన్లను, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూసివేసి నిరుపేదలను రోడ్డున పడేసింది. అధికారంలోకి వచ్చాక తిరిగి అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎన్డీయే ప్రభుత్వం, తాజాగా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది. 203 అన్న క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని మొదట భావించినా భవన నిర్మాణ పనులు పూర్తి కానందున తొలి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. రెండు, మూడు విడతల్లో మిగిలిన క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
నామమాత్రపు ధరకు నాణ్యమైన ఆహారం : పేదలకు ప్రభుత్వం పంద్రాగస్టు కానుకగా అన్నక్యాంటీన్లను సిద్ధం చేసింది. రోజూ లక్షా 5 వేల మంది పేదల ఆకలి తీరనుంది. ఒక్కొక్కరి నుంచి పూటకు 5 రూపాయల చొప్పున నామమాత్రపు ధరకు నాణ్యమైన ఆహారం అందించనున్నారు. మూడు పూటలా పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను నేడు చంద్రబాబు ప్రారంభించారు.
కృష్ణా జిల్లా గుడివాడలో మొదటి అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. మిగిలిన 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభిస్తారు. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి. అన్న క్యాంటీన్లలో సోమవారం నుంచి శనివారం వరకు రోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రికి భోజనం అందించనున్నారు.